Xiaomi SU7 EV: స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి నుంచి ఎలక్ట్రిక్ కారు, ఒక్క ఛార్జ్‌తో 1200 కిమీ మెరుపు వేగంతో ప్రయాణించగలదు, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ స్పీడ్ ఆల్ట్రా7 మాక్స్ వెర్షన్ EV విశేషాలు తెలుసుకోండి!
Xiaomi SU7 EV: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం షావోమి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2024)లో షావోమి కంపెనీ తమ బ్రాండ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన Xiaomi SU7ని ప్రదర్శించింది. ఇక్కడ SU7 అంటే 'స్పీడ్ అల్ట్రా7'కి సంక్షిప్త రూపం. పేరుకు తగినట్లే షావోమి SU7 ఎలక్ట్రిక్ సెడాన్ ఎంతో శక్తివంతమైనది, ఇది EV లలో మ్యాక్స్ వెర్షన్ అని కంపెనీ వెల్లడించింది. SU7 పనితీరు పరంగా పోర్స్చే వంటి లగ్జరీ కార్లకు సమానంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు గంటకు సుమారుగా 265 కిమీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని కంపెనీ నివేదించింది. అయితే దీని వేగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సి ఉంది.
ప్రదర్శనలో ఉంచిన Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్ ఆక్వా బ్లూ ఎక్ట్సీరియర్ కలర్‌తో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు, దృఢమైన భారీ బానెట్, ఎయిర్ వెంట్‌లతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారును ఈ ఏడాది చివర్లో అధికారికంగా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసి, ఆపై డెలివరీలు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కాగా.. ఈ కారుతో అంతర్జాతీయ మార్కెట్లో టెస్లా మరియు BYD వంటి EV దిగ్గజ కంపెనీ మోడళ్లతో పోటీ పడాలని షావోమి లక్ష్యంగా పెట్టుకుంది.
Xiaomi SU7 ఫీచర్లు, టెక్నాలజీ
Xiaomi SU7 కారు అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇది Xiaomi పైలట్ అని పిలువబడే అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన స్వయంప్రతిపత్త డ్రైవింగ్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి డ్రైవర్ లేకపోయినా, ఆటోమేటిక్ మోడ్ ఆన్ చేయడం ద్వారా ఇది దానంతటదే డ్రైవ్ చేసుకోగలదు. ఇందుకోసం ఈ కారులోని సాంకేతికత 5 మీటర్ల నుండి 250 మీటర్ల వరకు పనిచేసే అడాప్టివ్ మ్యాపింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా సురక్షితమైన డ్రైవింగ్ కోసం 11 LiDar కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ రాడార్లు మరియు 3mm వేవ్ రాడార్‌లను ఉపయోగిస్తుంది.
ఫీచర్ల పరంగా.. EV నప్పా లెదర్‌లో అప్‌హోల్‌స్టర్ చేయబడిన వెంటిలేటెడ్ సీట్లు, 16.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లిప్-అప్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, వెనుక ప్రయాణీకుల కోసం రెండు స్క్రీన్‌లు, 56-అంగుళాల HUD వంటి మరిన్నో ఫీచర్లు ఉన్నాయి.
Xiaomi SU7 బ్యాటరీ సామర్థ్యం
షావోమి 2023లో చైనాలో ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రామాణిక వెర్షన్ కు ఇది ప్రతిరూపం. అయితే, SU7 మాక్స్ వెర్షన్ కోసం V8s ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. Xiaomi SU7 Maxలోని ఇంజన్ 673 hp శక్తిని, 838 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. SU7 మ్యాక్స్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీ CTB (సెల్-టు-బాడీ) సాంకేతికతను కలిగి ఉంది.
ఈ SU7 డ్రాగ్ కోఎఫీషియంట్ cd 0.195తో ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉండటం వలన ఈ కారు కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు, 33.3 సెకన్లలో 100 kmph నుండి పూర్తిగా సున్నాకు వేగాన్ని తగ్గించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంకా, కారు గరిష్టంగా 265 kmph వేగాన్ని అందుకోగలదు