Discount Sales Ban: బ్యాన్ దిశగా డిస్కౌంట్ సేల్స్, ఈ కామర్స్ దిగ్గజాల వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం కన్ను, ఫిర్యాదు చేసిన సీఏఐటీ, డిస్కౌంట్ దందాపై దర్యాప్తు చేపడతామన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
మొత్తం ఏడాది వ్యాపారంలో సగం పండగ సీజన్‌లోనే జరుగుతుందనే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వరుస ఫిర్యాదుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
October 28: ఈ కామర్స్ దిగ్గజాలు పండుగ సమయాల్లో ప్రకటిస్తున్న డిస్కౌంట్ దందాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మొత్తం ఏడాది వ్యాపారంలో సగం పండగ సీజన్‌లోనే జరుగుతుందనే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వరుస ఫిర్యాదుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్కెట్‌లో మరొకరికి అవకాశం లేకుండా, పోటీకి రాకుండా చేస్తున్న ‘డిస్కౌంట్ దందా’కు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా మెజాన్, ఫిప్‌కార్ట్ సంస్థల వ్యాపార పద్ధతి చట్ట విరుద్ధమని వాటిపై చర్యలు తీసుకుంటామని గత వారం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. డిస్కౌంట్ దందాపై దర్యాప్తు కూడా జరుపుతామని ప్రకటించారు.
కాగా అక్టోబరులో రెండు ఈ-కామర్స్ సంస్థల ద్వారా జరిగిన వ్యాపారం దాదాపు వందకోట్ల డాలర్లు మన కరెన్సీలో రూ. 7 వేల కోట్ల రూపాయలని సమాచారం. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ ఆఫర్లు? ఎవరు ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? అనే అంశాలపై కేంద్రం ఆరా తీస్తోంది. ఇందులో భాగంగానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ఒక ప్రశ్నావళి పంపి సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్న అతిపెద్ద విక్రేతల వివరాలు ఇవ్వాలని కోరింది. వీటిపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా స్పందించలేదు. ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులతోపాటు సీఏఐటీ సభ్యులతో కేంద్ర అధికారులు ఇప్పటికే పలు విడతలు చర్చించారు.
దీనిపై కంపెనీలు విభిన్నంగా స్పందిస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చెబుతున్నాయి. భారీ డిస్కౌంట్ దందా (ప్రిడేటరీ ప్రైసింగ్)కు తెరలేపామన్న ఆరోపణలను ఖండించాయి.
ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు మేం ఇస్తున్నవి కావని, ఉత్పత్తిదారులే డిస్కౌంట్లు ఇస్తున్నారని కేంద్రానికి తెలిపాయి. అయినప్పటికే కేంద్రం ప్రిడేటరీ ప్రైసింగ్ మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కేంద్రం దీనిపై చర్యలు తీసుకుంటే ఇకముందు, దసరా సేల్స్, దీపావళి ధమాకాలు, న్యూ ఇయర్ ఫీవర్లు ఉండకపోవచ్చు.