Venu Madhav Passed Away: హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత, తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు మరియు అభిమానులు, 400 సినిమాలలో నటించి చెరగని నవ్వులు అందించిన నటుడు

అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 12:21 సమయంలో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు...

File Image of Actor Venumadhav | Photo - Twitter

Hyderabad, September 25: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ (Venu Madhav) కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. గత కొద్దికాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 06న ఆసుపత్రిలో చేరారు. అయితే మంగళవారం వేణుమాధవ్ విషమించడంతో నిన్నటి నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలెటర్ పై చికిత్సనందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 12:21 సమయంలో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.

మిమిక్రీ ఆర్టిస్ గా కెరియర్ ప్రారంభించిన వేణుమాధవ్ తొలిసారిగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1997లో వచ్చిన 'సంప్రదాయం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన శైలి కామెడీతో అనతికాలంలోనే బ్రహ్మనందం, అలీల తర్వాత టాప్ కమెడియన్ గా పేరుతెచ్చుకున్నారు. కమెడియన్ గానే కాకుండా హంగామా, భూకైలాస్ మరియు ప్రేమాభిషేకం వంటి సినిమాలలో హీరోగా కూడా నటించారు.

'లక్ష్మీ' సినిమాలో వేణు మాధవ్ పండించిన హస్యానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, మరోసారి ఆయన నటన ఇక్కడ చూడండి. 

(Video Credits: Aditya Movies)

దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సినిమాలలో వేణుమాధవ్ నటించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో చాలాకాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ రాణించలేకపోయారు. అయితే ఎన్నికల సమయాల్లో వివిధ రాజకీయ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. తెలంగాణలో జరిగిన గత శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.

వేణుమాధవ్ దాదాపు 400 సినిమాలలో నటించారు, 2006లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలలో ఆయన పంచిన హాస్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆయన చివరగా 2015లో వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో కనిపించారు.