Ajay Devgn vs Kichcha Sudeep: హిందీ జాతీయ భాష దుమారం, కిచ్చా సుదీప్ vs అజయ్ దేవగన్ మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్, ఎట్టకేలకు కాంప్రమైజ్ అయిన ఇద్దరు నటులు
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ (Kichcha Sudeep) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
హిందీ భాషపై వివాదం మరింతగా ముదురుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ (Kichcha Sudeep) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఆయనకు ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్‌లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ (Ajay Devgn Responds) ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ ‘హిందీ జాతీయ భాష (Hindi Is India’s National Language) కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. దీంతో అజయ్ దేవగన్ ట్వీట్‌కు సుదీప్ స్పందిస్తూ.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
అలాగే మరో ట్వీట్‌లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితో ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంతా దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ అంటూ సుదీప్ ట్వీట్‌కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది.
కాగా సుదీప్.. 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.