Bhola Shankar: భోళా శంకర్ మూవీకి షాక్, నా డబ్బులు తిరిగి ఇచ్చే వరకు విడుదల ఆపాలని కోర్టు మెట్లెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతల నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
తాజాగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. పిటిషన్ వెనక్కు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు.
భోళా శంకర్ సినిమాను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లెక్కారు. తాజాగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. పిటిషన్ వెనక్కు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల నిర్మాతలతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.
అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 27న విడుదల కాగా..ఈ సినిమా నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు అందరికీ కోట్ల కొద్ది నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను నిర్మించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనను మోసం చేశారని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ ఆరోపిస్తున్నారు.
Here's Video
ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక‍్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు సత్యనారాయణకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని నిర్మాతలు అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇందుకోసం రూ.30 కోట్లు తీసుకున్నారని రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్ లో పేర్కొన్నారు.
అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడితే ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి వెళ్లిపోయాడు. తర్వాత 'సామజవరగమన' వైజాగ్ హక్కులు సత్యనారాయణకే ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది. ఇంకా రావాల్సిన డబ్బు గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే సమాధానం రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. తనకు డబ్బు ఇచ్చేవరకు భోళా శంకర్‌ను ఆపాలని కోరాడు.