IT Raids Sonu Sood Offices: వరుసగా మూడో రోజు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు, పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో సోదాలు జరిపామని తెలిపిన ఐటీ అధికారులు

వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు.. ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

Sonu Sood (photo credit: Instagram)

Mumbai, Sep 17: ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు (IT Raids Sonu Sood Offices) కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు.. ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబయిలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్‌పూర్‌, జైపుర్‌లలో ఏకకాలంలో ఈ సోదాలు (searches multiple premises) కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామని అధికారులు తెలిపారు.

బాలీవుడ్‌ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోనూ వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించామని పేరు చెప్పెందుకు ఇష్టపడని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు.

సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించున్న ఢిల్లీ ప్రభుత్వం, 'దేశ్ కే మెంటర్' కార్యక్రమం విశేషాలు చెప్పిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని స్పష్టత

నిన్న మరోసారి సోనూ నివాసానికి వెళ్లిన అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా స్థిరాస్తి సంస్థతో ఒప్పందం గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల సోనూసూద్‌.. ఢిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొవిడ్‌ వేళ వలస కూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.కరోనా సమయంలో లక్షలాది కుటుంబాలకు సూద్‌ సాయం చేశారని.. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తారని, ఈ కష్టకాలంలో మద్దతుగా నిలుస్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి సమయంలో సోనూసూద్ వలసకార్మికులు వివిధ నగరాల నుంచి వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు రవాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఐటీ అధికారుల దాడులు ప్రారంభం కాగానే దేశవ్యాప్తంగా ఉన్న సోనూసూద్ అభిమానలు అతనికి మద్ధతుగా నిలుస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.