Lata Mangeshkar Biography: భారతరత్న లతా మంగేష్కర్ జీవితంలో కీలక ఘట్టాలు, అవమానాలు, అవార్డులు, భారతకోకిల గురించి కొన్ని నమ్మలేని నిజలు మీకోసం..
ఆమె (Lata Mangeshkar) గానామృతం యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆమె పాడిన ప్రతీ పాటదీ ఒక ప్రత్యేకత. ఆమె జీవితం ఎందరో భావి గాయక, గాయనీమణులకు ఆదర్శం. ఆమె పేరే "లతా మంగేష్కర్".
ఆమె పాడితే చాలు కళాభిమానుల గుండెలు పరవళ్లు తొక్కుతాయి... ఆమె (Lata Mangeshkar) గానామృతం యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆమె పాడిన ప్రతీ పాటదీ ఒక ప్రత్యేకత. ఆమె జీవితం ఎందరో భావి గాయక, గాయనీమణులకు ఆదర్శం. ఆమె పేరే "లతా మంగేష్కర్". భారతకోకిలగా, గాన సరస్వతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే ఆ మేటి గాయని అందర్ని (Lata Mangeshkar No More) వదిలి దివికేగింది.
1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించిన లతా మంగేష్కర్ అయిదవ ఏటనే సంగీతంపై మక్కువను పెంచుకున్నారు. కె.ఎల్ సైగల్ పాటలకుఆమె వీరాభిమాని. పదమూడేళ్ల వయసులో తండ్రి చనిపోయాక.. కుటుంబ పోషణ తన మీద పడడంతో లతా మంగేష్కర్ సినీ రంగంలోకి నటిగా, గాయనిగా ప్రవేశించాల్సి వచ్చింది.
1942లో పహ్లా మంగళ్ గౌర్ అనే చిత్రంలో నటించి, పాటలు కూడా పాడారు. గులాం హైదర్ అనే సంగీత దర్శకుడు లతను తన కన్నబిడ్డగా భావించి, ప్రోత్సహం ఇవ్వడంతో ఆమె మంచి నేపథ్యగాయకురాలిగా పేరు తెచ్చుకుంది. తొలుత జీవన్ యాత్ర, మందిర్ లాంటి సినిమాల్లో పాటలుపాడినా, ఆ తర్వాత అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలి వంటి హిట్ చిత్రాలు లత పాటలను ఎందరో అభిమానులకు చేరవేశాయి.
లతా నేపథ్య గాయకురాలిగా కొనసాగుతున్న కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ గాయనిలుగా వెలుగుందుతున్నారు. దేశ విభజన సమయంలో వీరు పాకిస్థాన్ వెళ్లడం.. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడం లతా మంగేష్కర్‌కు కలిసొచ్చింది. తర్వాత మంచి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. సినీ ప్రయాణం ప్రారంభంలోనే లతా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ మరాఠి చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాటను తొలగించారు. ఆ తర్వాత 'మజ్‌బూర్'లోని 'దిల్ మేరా తోడా' పాట పాడారు. ఇది విన్న వారంతా ఆమెను విమర్శించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఈమె.. ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకున్నారు.అనంతరం 'మహల్' సినిమాలోని ఆయేగా ఆయేగా పాటతో లతాజీ దశ తిరిగింది. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.
అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లో లత పాడిన పాటలు ఆమెకు ఒక స్టార్ సింగర్ హోదాను కట్టబెట్టాయి. సినిమా రంగంలో మరిన్ని అవకాశాల కోసం తన కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చిన లత, అమంత్ ఖాన్ దేవస్వలే, పండిట్ తులసీదాస్ శర్మ లాంటి గురువుల వద్ద ఎప్పటికప్పుడు సంగీత మెళకువలను నేర్చుకుంటూ.. తన ప్రతిభకు సాన పెట్టుకొనేవారు. 1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు.
శంకర్ జై కిషన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్, హుసన్ లాల్ భగత్ రాం, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె. మొఘల్-ఎ-అజమ్ (1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట జనాలను సమ్మోహితులను చేసింది.
1963 జనవరి 27లో చైనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగో(నా దేశ ప్రజలారా) పాట పాడారు లత. ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారట.1970ల నుంచి లతా మంగేష్కర్ సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను స్వచ్చంద్ధ సంస్థల కోసంఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. కచేరీలు చేస్తూనే, సినీ పాటలు పాడేవారు ఆమె. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన "సత్యం శివం సుందరం" సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.
1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జు జు జు పాట ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట, సత్య సినిమాలో వలై ఒసీ పాట పాడారు లత. 1980 వ దశకంలో బప్పీలహరి ఎన్నో డిస్కో-ప్రభావిత పాటలను అందించారు.
దూరియా సబ్ మితా దో సబూత్ (1980), బైతే బైతే ఆజ్ ఆయీ పతిత (1980), తోడా రెషమ్ లగ్తా హై జ్యోతి (1981), దర్ద్ కీ రాగిణీ ప్యాస్ (1982), కిషోర్ కుమార్ తో పాడిన డ్యుయెట్ నైనో మే సపనా హిమ్మత్ వాలా (1983) వంటివి వారిద్దరి భాగస్వామ్యంలో వచ్చిన హిట్ పాటలు. శంకర్ జై కిషన్ లాంటి ఆనాటి సంగీత దర్శకుల నుండి నేటి ఎ.ఆర్ రెహమన్ వంటి సంగీత దర్శకుల వరకూ దాదాపు అందరి సినిమాలకు లత పాటలు పాడారు.
1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డ్‌లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్వారు ఆమె.
భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. ప్రముఖ శాస్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు .
అలాగే గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన పాటలు పాడారు .టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" గా పేర్కొనడం విశేషం.
లతాజీ నోట వినిపించని అందమైన రాగం లేదు. ఆమె పాటతో పరవశించని భారతీయ గీతాభిమాని లేడు. భజనలైనా, భక్తి సంకీర్తనలైనా, దేశభక్తి గీతమైనా, ప్రేమ గానమైనా, విషాద రాగమైనా, వియోగ భరిత ఆలాపన అయినా.. లతాజీ పాడిందే పాట. ఆమె నోట వినిపించిందే పాట. అందుకే ఆమె ఇంటి ముంగిట వద్దకే అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న పురాస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఎన్‌టీఆర్, ఏఎన్నార్, మహారాష్ట్ర భూషణ్ అవార్డులను దక్కించుకున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రం సన్మానించింది.
తన గళంతో ఎన్నో అద్బుతాలు సృష్టించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించకున్న లతా మంగేష్కర్.. కె.ఎల్ సైగల్ పాటలకు వీరాభిమాని. 1962లో లతా మంగేష్కర్‌పై స్లో పాయిజన్‌ను ప్రయోగించారు. దీనివల్ల ఆమె దాదాపు 3 నెలల పాటు మంచం పట్టారు. ఆ విష ప్రయోగం చేసిందెవరో ఇప్పటికీ తేలలేదు. ఆమె వద్ద పనిచేసే వంటమనిషి.. ఈ ఘటన తర్వాత వేతనం తీసుకోకుండా అదృశ్యమవడం పలు అనుమానాలు రేకెత్తించింది. ఇప్పుడు అందర్నీ శోక సంద్రంలో ముంచి దివికేగారు.