Lata Mangeshkar Passes Away: ఐదేళ్లకే సంగీత సాధన, 13 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్, ఇదీ లతా మంగేష్కర్ ప్రస్థానం, ఆమెకు దక్కని అవార్డు లేదు, పాడని భాష లేదు
Lata Mangeshkar is still on life support, doctor says her condition is slowly improving (Photo-Twitter)

Mumbai Feb 06: లెజెండ్రీ సింగర్, భారత రత్న అవార్డు గ్రహీత(Bharat ratna) లతా మంగేష్కర్ (Lata Mangeshkar)...ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. సూపర్ స్టార్ నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ వరకు చాలా మంది నటీమణులకు గొంతుకై నిలిచారు లతా. 13 ఏళ్లకే సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె....92 ఏళ్ల వయసొచ్చినా కూడా పాటను వదల్లేదు. ఇండియన్‌ నైటింగేల్‌గా పేరొందిన లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) తన 13 సంవత్సరాల వయసులో 1942లో కెరీర్‌ను ప్రారంభించారు. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఆమె 7 దశాబ్దాల గాయనీ ప్రయాణంలో మరపురాని పాటలను ఆలపించారు. అందులో 'అజీబ్‌ దస్తాన్‌ హై యే', 'ప్యార్‌ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్‌ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు.

ఆమె గాత్రంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో అత్యున్నత పురస్కారాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 'పద్మ భూషణ్‌', 'పద్మ విభూషణ్‌', 'దాదా సాహెబ్‌ ఫాల్కే', 'బహుళ జాతీయ చలనచిత్ర' అవార్డులతో సహా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అవార్డును పొందారు లతా మంగేష్కర్‌. భారత ప్రభుత్వం నుంచి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్‌. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి(MS Subba lakxmi) తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే. 2001లో భారత ప్రభుత్వం ఆమెకు భారత రత్న అవార్డును ఇచ్చి సత్కరించింది. 1999లో పద్మవిభూషణ్, 1969లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు లత. ఫ్రాన్స్ ప్రభుత్వం 2006లో ది లీజియన్ అఫ్ హానర్ అవార్డును ఇచ్చింది. అంతేగాక.. 1989లో దాదా సాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషన్ అవార్డు, 1999లో ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డులతో పాటు.. శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలను అందించాయి.

లతా మంగేష్కర్‌ సెప్టెంబర్‌ 28, 1929న మధ్యప్రదేశ్‌లోని(Madhya pradesh) ఇండోర్‌లో జన్మించారు. 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 980 సినిమాల్లో పాటలు పాడి తన గానంతో అలరించారు. గాయనీగా కాకుండా నటిగా కూడా చేశారు లతా మంగేష్కర్‌. హిందీ సినిమా పాటల గాయనీ అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా మంగేష్కర్‌ పేరే. హిందీ సినీ పరిశ్రమపై అంతలా తనదైన ముద్ర వేశారు. లతా మంగేష్కర్‌ సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా (ఐదుగురిలో) జన్మించారు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోంస్లే, హృదయనాథ్‌, ఉషా, మీనా ఉన్నారు. ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు లతా మంగేష్కర్‌, సంగీతాన్ని వినడం, పాడటం తప్ప మరొక ప్రపంచం లేదు. తాను చదువుకోకపోయినా తన చెల్లెళ్లు మాత్రం పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు లతా మంగేష్కర్. కానీ వారు కూడా సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపడంతో కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది.

లతా మంగేష్కర్​కు 13 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దీంతో కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందుకే సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1942లో మరాఠీ చిత్రం 'పహ్లా మంగళ గౌర్‌'లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. తర్వాత చిముక్లా సుసార్‌ (1943), గజెభావు (1944), జీవన్‌ యాత్ర (1946), మందిర్‌ 1948) తదితర చిత్రాల్లో లతా మంగేష్కర్‌ నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్‌, సురైయాలు గాయనీలుగా వెలుగుతున్నారు. అయితే లతా మంగేష్కర్‌కు నచ్చిన గాయకుడు కె. ఎల్‌. సైగల్‌ అని తెలిపారు.

లతా మంగేష్కర్‌ 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో(Guinness  book of world records) పేరు సంపాదించుకున్నారు. గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఈమె తెలుగులోని సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి పాటలు, ఆఖరి పోరాటం సినిమాలో తెల్లచీరకు పాటలు పాడారు. 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను “భారతీయ నేపథ్యగాయకుల రాణి”గా కీర్తించింది.