#BheemforRamaraju: 'నా అన్న అల్లూరి సీతారామ రాజు' అంటూ కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్
'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది, కలబడితే ఏగుచుక్క ఎగబడినట్లుంటది, ఎదురుపడితే సావుకైనా చమట ధార కడ్తది, పాణమైనా.. బందూకైనా వాడికి బాంచన్ ఐతది.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామ రాజు' ........
RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్.ఆర్.ఆర్- రౌద్రం రణం రుధిరం' (RRR: Roudram Ranam Rudhiram) సినిమాలోని రామ్ చరణ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ అందజేశారు. అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో RRR ఒకటి. బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అందులోను టాలీవుడ్ నుంచి ఇద్దరు అగ్రహీరోలు నటిస్తుండటం, బాలీవుడ్ నుంచి టాప్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా పట్ల ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.
మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం దొర అల్లూరి సీతారామ రాజు (Ram Charan As Alluri Sitarama Raju) పాత్ర పోషిస్తుండగా, మరో మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ (NTR as Komaram Bheem) నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ ఇద్దరూ కూడా స్వాతంత్య్ర సమరయోధులే. అంతేకాకుండా వీరిద్దరూ శక్తివంతమైన విప్లవ వీరులే (Fierce Revolutionary Freedom Fighters). అందుకేనేమో రాజమౌళి కూడా ఈ రెండు పాత్రలకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేసేటపుడు పంచభుతాల్లోని రెండు శక్తులతో పోల్చారు.
RRR Motion Poster
ఆదిలాబాద్ అడవుల్లో ఎగసిన జ్వాల కొమరంభీం నిజాం రజాకర్లతో, బ్రిటీష్ వారితో ఏకకాలంలో ద్విముఖ పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ విప్లవకారుడు మన్యందొర అల్లూరి సీతారామ రాజును తన అన్నగా భావించి ఆయన ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్థి పొందినట్లు చరిత్ర చెబుతుంది.
అందుకే ఈరోజు విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్‌తో ఆ పాత్రను హైలైట్ చేయడం, తన అన్నగా సంభోదించడం గమనించవచ్చు. 'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది, కలబడితే ఏగుచుక్క ఎగబడినట్లుంటది, ఎదురుపడితే సావుకైనా చమట ధార కడ్తది, పాణమైనా.. బందూకైనా వాడికి బాంచన్ ఐతది.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామ రాజు' అని శక్తివంతమైన పరిచయం ఇచ్చారు.
Watch Ram Charan As Alluri Sitarama Raju in RRR
మరి ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉండబోతుందో వేచిచూడాలి. అయితే RRRలో పాత్రల పేర్లు చూస్తే ఇదొక పీరియాడిక్ డ్రామాలాగా అనిపిస్తుంది. కానీ రామ్ చరణ్ లుక్ చూస్తే మోడ్రెన్ గా మాచో మ్యాన్ లాగా కనిపించారు. దీనిని బట్టి 'జక్కన్న' ఈ సినిమా కథను ఏ విధంగా చెక్కారో అనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిసన్, రే స్టీవెన్సన్, అల్లిసన్ డూడీ, సముతిరాకని లాంటి బాలీవుడ్ మరియు హాలీవుడ్ స్తార్స్ నటిస్తున్నారు. ఒక మహత్తర కళాఖండంగా రూపుదిద్దుకుంటోన్న RRR జనవరి 8, 2021న విడుదల కానుంది.