RGV Supported Poonam Pandey: పూన‌మ్ పాండేకు స‌పోర్ట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌, త‌న‌వ‌ల్ల‌నే దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతోందంటూ మ‌ద్ద‌తు

ఇప్పుడు దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోంది. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే. మీరు ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా అంటూ పూనమ్‌పై రామ్ గోపాల్ వర్మ ప్ర‌శంస‌లు కురిపించారు.

Punam Pnade (photo-X)

Mumbai, FEB 03: బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్‌ మీడియాకు వెల్లడించారు. అయితే, ఆమె బతికే ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నటి టీమ్‌ అబద్ధం చెప్పిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. నటి ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి షాకింగ్‌ మెసేజ్‌ వచ్చింది. ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ పూనమ్‌ ఓ వీడియో షేర్‌ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించింది. అయితే పూనమ్ చేసిన ప‌నికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్యాన్సర్ పై అవగాహనా కల్పించడానికి ఎవరైనా ఇలా చేస్తారా అంటూ పూనమ్‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

 

అయితే ఈ వివాదంపై తాజాగా టాలీవుడ్ వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) స్పందించాడు. సర్వైకల్‌ క్యాన్సర్‌పై దృష్టిని ఆకర్షించడానికి పూనమ్‌ పాండే ఎంచుకున్న పద్ధతి విమ‌ర్శ‌ల‌తో పాటు కొంతమందికి అర్ధం అవ్వక నచ్చకపోవొచ్చు. కానీ, ఏ ఒక్కరూ పూనమ్‌ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోంది. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే. మీరు ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా అంటూ పూనమ్‌పై రామ్ గోపాల్ వర్మ ప్ర‌శంస‌లు కురిపించారు.