Tamannaah Bouncers Attack: తమన్నా ఫోటోల కోసం వస్తే చితకబాదారు, మూవీ ప్రెస్‌మీట్‌లో బౌన్సర్ల అత్యుత్సాహం, మీడియాపై దాడి చేసిన బౌన్సర్లు, బబ్లీ బౌన్సర్ ప్రమోషన్‌లో గందరగోళం
మీడియాతో ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత తమన్నా ఫోటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దీంతో తమన్నా బౌన్సర్‌లు ఆగ్రహంతో మీడియాపై దాడి చేశారు.
Hyderabad, SEP 17: దక్షిణాదిన అగ్ర కథానాయికగా పేరు పొందిన నటి తమన్నా (Tamannaah). వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం తమన్నా నటించిన ‘బబ్లీ బౌన్సర్’(Bubbly Bouncer) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 23 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో (Disney +Hotstar) ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో (Annapurna Studio)ప్రెస్‌మీట్ నిర్వహించింది. అయితే ఈ ప్రెస్‌మీట్ అనంతరం తమన్నా బౌన్సర్లు తెలుగు సినీ జర్నలిస్టులపై దాడి చేశారు.
‘బబ్లీ బౌన్సర్’ మీడియా సమావేశానికి తమన్నాతో పాటు దర్శకుడు మధుర్ బండార్కర్ హాజరయ్యాడు. మీడియాతో ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత తమన్నా ఫోటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దీంతో తమన్నా బౌన్సర్‌లు ఆగ్రహంతో మీడియాపై దాడి చేశారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధులు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ డోర్స్‌ని బౌన్సర్లు క్లోజ్ చేశారు. ఈ దాడిలో ఇద్దరూ కెమెరా మ్యాన్స్ గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలతోపాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.