Fight for what you love: వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ, వెళ్లిపోయేటపుడు ఎందుకింత బాధ పెడుతుంది?

ఈ కథ ఎలా ఉండొచ్చు? ఒకసారి చూడండి...

Dear Comrades... 'రౌడీ స్టార్' విజయ్ దేవరకొండ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సినిమా పడబోతుంది అన్నట్లుగా ఉంది 'డియర్ కామ్రెడ్' సినిమా థియేట్రికల్ ట్రైలర్. గీతా గోవిందం సినిమా తర్వాత రష్మిక మందనా మరోసారి విజయ్ దేవరకొండతో ఈ సినిమాలో జోడి కట్టింది.

ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే విజయ్ (Vijay Devarakonda) ఒక పవర్‌ఫుల్ స్టూడెంట్ లీడర్‌ గా, ప్రేమలో దెబ్బతిన్న యువకుడిగా కనిపిస్తున్నాడు. యూనివర్శిటీ స్థాయిలో తమ హక్కుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసే విద్యార్థి సంఘాలు నడుమ ఒకరినొకరు 'కామ్రెడ్' అని పిలుచుకుంటారు. కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వారిని 'కామ్రెడ్' లుగా పిలుస్తారు.  ఈ సినిమా కథకు ఈ 'డియర్ కామ్రెడ్' అనే టైటిల్ కూడా ఒక పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు.

ఇక్కడ ఈ ట్రైలర్ ప్రకారం Fight for what you love- నువ్వు దేనినైతే ప్రేమిస్తావో దాని కోసం పోరాడు అనే నినాదంతో ఈ కథ ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఇందులో విజయ్ తన ప్రేయసి కోసం పోరాడతాడా? లేదా తను ప్రేమించే దాని కోసం పోరాడతాడా చూడాలి. ఇందులో రష్మిక మందనా (Rashmika Mandanna) స్టేట్ లెవెల్ క్రికెటర్‌గా కనిపిస్తుండటం, ఇద్దరి మధ్య ప్రేమకథ ఆ తర్వాత విడిపోవడం అన్నీ చూస్తుంటే ఈ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా యూత్‌లో ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ అయితే కనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా నటనలో ఎంతో మెచ్యూరిటీ చూపిస్తాడు. ఇటువైపు కన్నడ హీరోయిన్ రష్మిక కూడా మంచి క్యారెక్టర్ ఉన్న కథలనే ఎంచుకుంటూ తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గీతాగోవిందం సినిమాలో చాలా బాగా కుదిరింది, ఈ డియర్ కామ్రెడ్ సినిమాలో అది కంటిన్యూ అవుతుంది. ఇందులో శృతి రామచంద్రన్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తుంది.

డియర్ కామ్రెడ్ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు, ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని, మళయాలంలో 'కామ్రెడ్ ఇన్ అమెరికా' సినిమాకు ఇది రీమేక్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదని డైరెక్టర్ భరత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భరత్ కమ్మకు ఇది ఫస్ట్ సినిమా. యానిమేషన్ కోర్స్ చేసిన భరత్ అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి టీంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. రొమాన్స్, యాక్షన్ మరియు క్రికెట్ ఈ మూడింటి నేపథ్యంలో సినిమా ఉంటుందని ఆయన చెప్పారు.