Indus Waters Treaty: పశ్చిమ జలాలపై మొదలైన వార్, హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లవన్న పీఎం మోడీ, మాకు హక్కులు ఉన్నాయంటున్న పాకిస్తాన్, ఇది దురాక్రమణ చర్య కిందకే అంటున్న దాయాది దేశం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
Islamabad, October 18: హిమాలయ సానువుల నుండి పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న మూడు నదీ జలాలపై వేడి రాజుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అక్కడ బీజేపీ తరపున ప్రచార సభలో మాట్లాడుతూ 70 ఏళ్ళ నుంచి భారత దేశానికి చెందిన జలాలు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని, ఈ జలాలు హర్యానా రైతులకు చెందినవని చెప్పారు. ఈ నీటిని పాకిస్థాన్‌కు వెళ్ళకుండా నిలిపేసి, ప్రజల ఇళ్ళకు తీసుకొస్తానన్నారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పందించారు. నదీ జలాలను తమ దేశంలోకి రానివ్వకుండా భారత్ అడ్డుకొని, వాటిని మళ్లిస్తే, ఆ చర్యను దాడిగా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పశ్చిమాన ప్రవహిస్తున్న నదులపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది. అలాంటి ప్రయత్నాలను దాడిగా పరిగణించి, తగిన రీతిలో సమాధానం చెప్తామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.
హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
నిజానికి పశ్చిమంగా ప్రవహిస్తున్న మూడు నదీ జలాలపై సంపూర్ణ హక్కు పాకిస్తాన్‌కే ఉందని ఆయన అన్నారు. గంగా నదీ జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్‌లో ప్రవహించే నీటిని అడ్డుకునే హక్కు భారత్‌కు లేదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలు ఏవైనాసరే, ప్రతిఘటించి తీరుతామని అన్నారు.భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదనే అనుకుంటున్నానని తెలిపారు. అయితే ఆయన ఏ నదుల గురించి మాట్లాడారన్నదానిపై క్లారిటీ లేదు.
కాగా, ఇరు దేశాల మధ్య నదుల నీటి విషయంలో సింధూ జలాల ఒప్పందం ఉంది. దాని ప్రకారం బియాస్, రావీ, సట్లెజ్ నదులను భారత్‌కు, సింధూ, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్‌కు చెందాయి. ఇరు దేశాలు ఎంత నీటిని వాడుకోవాలనేది ఉమ్మడిగా నిర్ణయించారు. అయితే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా భారత్ తన వాటాను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతోంది. ఆ నీళ్లతో పాకిస్థాన్ అదనపు లబ్ది పొందుతోంది. అయితే నీళ్లను అడ్డుపెట్టుకొని భారత్ తమతో ఐదో జనరేషన్ యుద్ధం చేస్తోందని పాక్ గతంలో ఆరోపణలు చేసింది. ఒక సందర్భంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. భారత్ తన వాటాను వాడుకోవడం వల్ల సింధూ ఒప్పందానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య చిచ్చు రేగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌తో దౌత్య సంబంధాలు తెంపుకొన్న పాక్, దేశంలో భారత రాయబారిని స్వదేశానికి పంపింది.