Bharat Bandh 2020: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం, పలుచోట్ల వాహనాలు, రైళ్లు నిలిపివేత, కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం తీవ్రం, మరికొన్ని చోట్ల పాక్షికం, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకం
ముంబై, చెన్నై, భువనేశ్వర్, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల నిరసనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారుల దిగ్భందనం, రస్తారోకో, రైల్ రోకో వంటి కార్యక్రమాలతో రవాణా సేవలకు అంతరాయం కలిగించారు.....
New Delhi, January 8: కేంద్ర ప్రభుత్వ 'ప్రజా వ్యతిరేక' విధానాలను నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు (trade unions) ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె కొనసాగుతుంది. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సహా కేంద్ర ప్రభుత్వం పలు ప్రజావ్యతిరేక విధానాలు (anti-people policies) అవలంబిస్తుందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు, వామపక్షాలు కలిసి బుధవారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించింది.
10 కేంద్ర సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ (Bharat Bandh 2020) పిలుపుకు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలలోని పలు చోట్ల నిరసనలకు మంచి స్పందన లభించింది. ఈ సమ్మె ప్రభావం ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలపై కనిపించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రవాణా సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
దేశవ్యాప్త సమ్మెతో తెలంగాణ (Telangana) అంతటా బ్యాంకింగ్ సేవలలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ మినహా మిగతా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. "ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలు వంటి సేవలు నిలిచిపోయాయి". అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు చెప్పారు. అయితే, చాలా షాపులు మరియు ఇతర వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. రవాణా సేవలు కూడా సాధారణంగానే ఉన్నాయి.
కాగా, రాష్ట్రంలోని వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు మూడు లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలంగాణ సిపిఐ సీనియర్ నాయకుడు సుధాకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో భారత్ బంద్ 2020 సమ్మెలో పాల్గొన్న కొందరు కాంగ్రెస్, సిపిఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 'దేశ వ్యతిరేక', 'ప్రజా వ్యతిరేక' విధానాలకు నిరసనగానే తాము సమ్మె చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. విదేశీ పెట్టుబడులు, పిఎస్‌యు విలీనాలు, ప్రైవేటీకరణ వంటి అంశాలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తాయని, తమ సమస్యలపై కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్‌తో జరిపిన చర్చలు విఫలమైనందున తప్పనిసరై సమ్మెకు దిగామని తెలిపారు. కేంద్రం ఇదే ధోరణిని కొనసాగిస్తే తమ సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్‌లో బంద్ హింసాత్మకం
పశ్చిమ బెంగాల్ (West Bengal) లో భారత్ బంద్ పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. షాపులు, విద్యా సంస్థలు, కార్యాలయాలు స్వచ్చందంగా మూసివేశారు. ఉద్యోగులు, కార్మికులు రోడ్లపైకి చేరి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నిరసనల ద్వారా రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది.
పలుచోట్ల కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ హింసాత్మక ఘటనలకు దారితీసింది. మాల్దా జిల్లాలో జాతీయ రహదారిని దిగ్భందించిన నిరసనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా చమురు బాంబులు విసురుతూ పలు పోలీసు వాహనాలు, బస్సులకు నిప్పుపెడుతూ బీభత్సం సృష్టించారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 24 పరగణ జిల్లాలో కల రైల్వే ట్రాక్ నుంచి పశ్చిమ బెంగాల్ పోలీసులు నాలుగు చమురు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
Here's the update:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వామపక్షాలు చేపట్టిన ఈ నిరసనను ఖండించారు. వామపక్ష గుండాలు బలవంతంగా బంద్ కు పాల్పడుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
హిమచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తీవ్రంగా కురుస్తున్న హిమపాతాన్ని లెక్క చేయకుండా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) కార్మికులు బంద్ లో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ లైవ్ అప్‌డేట్స్ ఈ లింక్ క్లిక్ చేసి పొందవచ్చు.
See the update:
ముంబై, చెన్నై, భువనేశ్వర్, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల నిరసనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారుల దిగ్భందనం, రస్తారోకో, రైల్ రోకో వంటి కార్యక్రమాలతో రవాణా సేవలకు అంతరాయం కలిగించారు. మొత్తంగా ఈ భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది. నిరసనలు ప్రశాంతంగానే సాగాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)