Hyderabad Floods: తెలంగాణకు రానున్న కేంద్ర బృందం, హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాలలో రెండు రోజుల పర్యటన, జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్న సెంట్రల్ టీమ్

ధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని కారణంగా తెలంగాణ మరియు ఏపీలలో అక్కడక్కడా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.....

Hyderabad Floods (Photo-Twitter)

Hyderabad, October 21: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గురువారం సాయంత్రం కేంద్ర బృందం హైదరాబాద్‌కు రానుంది. నగరంతో ఇతర వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి జరిగిన నష్టం తీవ్రతను అంచనా వేయనున్నారు. రాష్ట్రంలో వరదలపై గతవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ వరదల వల్ల కనీసం రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ. 1350 కోట్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి, రాష్ట్రంలో జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించనున్నారు.

హైదరాబాద్ లోని అనేక కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా మందిని రెస్క్యూ హోమ్‌లకు తరలించారు, ఇంకెంతో మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నగర ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ. 550 కోట్లను విడుదల చేసింది. వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు రూ .1 లక్ష , పాక్షికంగా కూలిపోయిన ఇళ్లకు రూ .50 వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మరోవైపు బుధవారం ఉదయం నుంచి కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్‌బి నగర్, ఉప్పల్, దిల్ సుఖ్‌నగర్, సరూర్‌నగర్, మెహదీపట్నం, మసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని కారణంగా తెలంగాణ మరియు ఏపీలలో అక్కడక్కడా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.