Bhainsa Riots: భైంసాలో చెలరేగిన మత ఘర్షణలు, అర్ధరాత్రి వరకు బీభత్సం, 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు, నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు
హైదరాబాద్ పాతబస్తీ లేదా దేశంలో ఎక్కడ ఎలాంటి మతపరమైన గొడవలు జరిగినా, భైంసా పట్టణంలో పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయి. ప్రస్తుతం దేశంలో.....
Bhainsa, January 13: నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా (Communal Violence) మారాయి. గొడవకు గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటికిప్పుడే తెలియనప్పటికీ, పట్టణంలోని కోర్బ గల్లీ ప్రాంతంలో ఒక వర్గానికి చెందిన యువకుడితో మరో వర్గానికి చెందిన కొంతమందికి మొదలైన చిన్నపాటి వాగ్యుద్ధం పెద్ద గొడవకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరికి మద్ధతుగా ఒకరు తరలి వచ్చి ఒకరిపైఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లరిమూకలు ప్రజల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. కొన్ని ఇండ్లకు, ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఇండ్ల లోపలికి ప్రవేశించి నగలు, సొమ్మును దోచుకెళ్లి బీభత్సం సృష్టించారని నివేదికల ద్వారా తెలుస్తుంది.
పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితులు అదుపు చేసే ప్రయత్నం చేసినా, ఫలితం లేకుండా పోయింది. ఇరు వర్గాల రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీ మరియు సీఐలకు కూడా గాయాలయ్యాయి. వీరితో పాటు మరో 11 మంది కూడా గాయపడినట్లు సమాచారం. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. సున్నితమైన ప్రదేశాలలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణమే కనిపిస్తున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా పరిస్థితులు మారాయి.
భైంసా అతిసున్నితమైన పట్టణం. హైదరాబాద్ పాతబస్తీ లేదా దేశంలో ఎక్కడ ఎలాంటి మతపరమైన గొడవలు జరిగినా, భైంసా పట్టణంలో పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయి. ప్రస్తుతం దేశంలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో పలు చోట్ల కూడా నిరసనలు జరుగుతున్నాయి. భైంసా సమీపంలో రెండు రోజుల క్రితం ఒకవర్గాని చెందిన ప్రజలు భారీ ఎత్తున సమావేశమైన మరొసటి రోజు నుంచే పట్టణంలో మత ఘర్షణలు మొదలవడం గమనార్హం.
అదేకాకుండా, ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Polls) వేడి కొనసాగుతుంది. ఈ క్రమంలో రాజకీయంగా లబ్ది పొందేందుకు ఒక ప్రణాళిక ప్రకారమే ఈ తరహా అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారా? అనే అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.