TS Inter Marks Memo: తెలంగాణ ఇంటర్ మార్కుల మెమోలు విడుదల, అభ్యంతరాలను జూలై 10 లోపు సమర్పించాలని విద్యార్థులకు సూచన; సెప్టెంబర్ నుంచి డిగ్రీ క్లాసుల ప్రారంభం

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలను ప్రకటించిన నాలుగు రోజుల తరువాత, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్బిఐ) మార్కుల మెమోలను విడుదల చేసింది...

Representational Image | File Photo

Hyderabad, July 2: ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలను ప్రకటించిన నాలుగు రోజుల తరువాత, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్బిఐ) మార్కుల మెమోలను విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in నుండి తమ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే ఇందుకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వారి కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రందించాలి.

మరో విధానంలో కూడా తమ అభ్యంతరాలను పంపవచ్చు. తమ సందేహాలను నేరుగా మెయిల్ ఐడి helpdeskie@telangana.gov.in కు పంపవచ్చు ,  లేదా వెబ్‌సైట్ (http://bigrs.telangana.gov.in) ద్వారా జూలై 10 లోపు పంపిచవచ్చునని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ 28 న విడుదలయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయటంతో పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ ఉత్తీర్ణులైనట్లుగానే విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 4,51,585 మంది విద్యార్థులను పాస్‌గా ప్రకటించగా, వారిలో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు.

విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులలో ప్రథమ సంవత్సరం మార్కులు కేటాయించగా, ప్రాక్టికల్స్‌లో పూర్తి మార్కులు ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా గతేడాది పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు కనీస పాస్ మార్కులు అంటే 35 శాతం మార్కులు ఇచ్చారు.

ఇదిలా ఉంటే, డిగ్రీ తరగతులు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ (యూజి) తరగతుల ప్రారంభం, డిగ్రీ ప్రవేశాలు తదితర అంశాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిహెచ్‌ఇ) సమావేశం అయింది. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ క్లాసుల ప్రారంభం అవుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది.