Telangana SSC Exams: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా! హైకోర్ట్ జీహెఎంసీలో మాత్రమే వాయిదా వేయాలని చెప్పిన కొద్ది గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా SSC పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కోసం....

Representational Image (Photo Credits: PTI)

Hyderabad, June 6:  తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పదో తరగతి (Telangana SSC Exams 2020) పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కొద్ది గంటల క్రితం హైకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా SSC పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తాజా ప్రభుత్వ ప్రకటనతో సోమవారం (జూన్ 8) నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా వాయిదా పడ్డాయి. తర్వాత పరీక్షల నిర్వహణ ఎప్పుడనేది ప్రభుత్వం వెల్లడించలేదు.

అంతకుముందు ఏం జరిగిందంటే..

రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విద్యావేత్తలు బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రాయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన ధర్మాసనం పది పరీక్షలపై ప్రభుత్వ వైఖరేంటని? అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో సప్లెమెంటరీ రాసేందుకు అనుమతిస్తామని మిగతా ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను వినిపించారు.

ప్రభుత్వం వాదనలతో అసంతృప్తి చెందిన ధర్మాసనం, పరీక్షలు జరిగే ప్రాంతాలు కూడా కంటైన్మెంట్ జోన్లుగా మారితే అప్పుడు పరిస్థితేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో ఎవరైనా విద్యార్థి చనిపోతే బాధ్యత ఎవరిదని నిలదీసింది. ఇలా వాదోపవాదాల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదో తరగతి పరీక్షలను హైకోర్ట్ వాయిదా వేసింది. అయితే జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి యధాతథంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

గ్రేటర్ పరిధిలో సప్లమెంటరీ రాసేందుకు అందరు విద్యార్థులకు అనుమతించాలని, వీరందరినీ కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాలని హైకోర్ట్ సూచించింది.

హైకోర్ట్ తీర్పుపై అధికారులతో విచారణ జరిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మొత్తంగా పదో పరీక్షలను వాయిదా  వేస్తున్నట్లు ప్రకటన చేశారు. తర్వాత పరీక్షల నిర్వహణ ఎప్పుడనేది సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.