Killing Green: చెట్లు నరికితే భారీ జరిమానాలతో పాటు, జైలు శిక్ష తప్పదు. హైదరాబాదులో ఒక వ్యక్తికి చెట్లు నరికినందుకు రూ. 39 వేలు జరిమానా, మరోచోట వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.

ఇంకోచోట ఇంకొకరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం...

Image used for representational purpose only.

పచ్చని చెట్లు నరికివేయడం, పచ్చదనం లేకపోవడం వలన ఎంతటి దుష్ఫలితాలు ఎదుర్కుంటున్నామో మనకు తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో నిన్నమొన్నటి వేసవి ప్రతాపం ఎలాంటిదో అందరూ అనుభవించిందే. ఈకాలం ఆకాలం అని లేకుండా ఎండలు విజృంభిస్తున్నాయి, వర్షాలు సరైన సమయంలో రాక రైతులకు కష్టం కలుగుతుంది. ఒకొక్క సమయంలో తాగటానికి, గృహావసరాలకు చుక్క నీరు లేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనంతటికీ కారణం గ్రీనరీని మర్డర్ చేయడమే. చెట్లను నరికేవారిపై కూడా మనిషిని మర్డర్ చేసిన వారితో సమానంగా క్రిమినల్ చట్టాలను అమలు చేయాలి.

ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్, బంజారాహిల్స్ లో గల ఒక బిల్డింగ్ యజమానికి చెట్లు నరికినందుకు అటవీశాఖ అధికారులు రూ.39,060/- ఫైన్ వేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ ప్రైవేట్ భవనం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని ఆ భవనానికి అనుకోని ఉన్న మూడు పెద్ద చెట్లను అటవీశాఖ అనుమతులు తీసుకోకుండానే ఆ భవన యజమాని నరికివేశాడు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు అటవీశాఖకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు వచ్చి ఆ చోటును పరిశీలించారు. అనంతరం భవన యజమానికి నోటిసులిచ్చి, అతడికి ఫైన్ విధించటంతో విధిలేని పరిస్థితుల్లో ఆ మొత్తం జరిమానాను భవన యజమాని చెల్లించాడు.

మరోచోట సిద్ధిపేటలో చెప్పుల దుకాణం నడిపే ఓ వ్యక్తి చెట్టును తమ ఆవరణలోని చెట్టును నరికివేశాడు. దీనిపై కంప్లైంట్ వెళ్లటంతో, అధికారులు సీసీటీవీ ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నిందితుడికి ఫైన్ వేసే బదులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టి న్యాయమూర్తి తీర్పుమేరకు శిక్ష ఖరారు చేయనున్నారు.

ఇప్పటికే కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ నగరంలో పచ్చదనం తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ, అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. హరితహారం పేరుతో అడవుల పెంపకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చెట్ల నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ సమాజంలో కొంతమంది అజ్ఞానపూరితంగా, స్వార్థం కోసం చెట్లను నరికివేస్తున్నారు. దీని తిరిగి ప్రజలే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అన్నిచోట్ల చెట్లు నరికే వారిపై భారీ జరిమానాలతో పాటు, మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే చట్టాలు అమలులో ఉన్నాయి. మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా 'గ్రీన్ మర్డర్' చేస్తే , స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.