
Vjy, Mar 7: వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రంగన్న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడని ఆయన భార్య చెబుతున్నప్పటికీ, పలు వైపుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ( CM Chandrababu Naidu) రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
నేడు ఏపీ కేబినెట్ భేటీ అనంతరం వాచ్ మన్ రంగన్న మృతిపై (Watchman Rangayya's death) చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇదే విధంగా మరణిస్తూ వచ్చారని ఇప్పుడు వివేకా హత్య కేసులో అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
వివేకా హత్య (Viveka Murder Case) జరిగినప్పుడు జగన్, వైఎస్ భారతిలను కారులో హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న విషయం, వివేకా హత్య గురించి కారులో జగన్, భారతి మాట్లాడుకున్న మాటలను ఆ డ్రైవర్ విన్నాడని, ఆ తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ గతంలో జరిగిన ప్రచారంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
వివేకా వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఏడుగురు మరణించారని కూడా చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను అనేకసార్లు చెబుతున్నానని గుర్తుచేశారు. కాగా, వాచ్ మన్ రంగన్న మృతి వెనుక పోలీసుల హస్తం ఉందంటూ వచ్చిన వార్తలపై డీజీపీ స్పందించారు. డీజీపీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రంగన్న మృతిలో అనుమానాలు ఉన్న మాట నిజమేనని, పోలీసుల విచారణలోనూ ఆ విషయం స్పష్టమైందని అన్నారు.
2019, మార్చి 15వ తేదీ తెల్లవారుజామున మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో.. ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగన సమయంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ పరిధిలో ఉంది.