Cyclone Bulbul Effect: పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోన్న బుల్‌బుల్, పూర్తిగా నిలిచిపోయిన విమాన సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలకు మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన బెంగాల్ ప్రభుత్వం
అక్కడ ఈ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని వణికిస్తోంది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి.
Kolkata, November 10: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ తుఫాన్ (cyclonic storm Bulbul) పశ్చిమ బెంగాల్‌పై విరుచుకుపడింది. అక్కడ ఈ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని వణికిస్తోంది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి.
తుఫాన్ ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. సముద్రంలో 2 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో బెంగాల్‌లో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోల్‌కతా ఎయిర్‌పోర్టు(Kolkata airport)లో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తీవ్ర తుఫాన్ బుల్ బుల్ (Cyclone Bulbul) ప్రభావంతో 2019, నవంబర్ 09వ తేదీ శనివారం రాత్రి వరకు కోల్‌కతాలో 72 మిల్లీమీటర్లు.. డైమండ్ హార్బర్‌లో 75 మిల్లీమీటర్లు.. దిఘాలో 93 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది.
తుఫాను ధాటికి విలవిల
సాగర్ వద్ద తీరం దాటిన తర్వాత బుల్ బుల్ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా పయనిస్తూ సుందర్ బన్ డెల్టా మీదుగా ఖేపుపారా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్ తీరం ( Indo-Bangladesh ) ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
సహాయక చర్యలు ముమ్మరం
బుల్‌బుల్ తుపానును ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వెస్ట్ బెంగాల్ సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
తుపాన్ ప్రభావంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవుల్ని మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Chief Minister Mamata Banerjee) స్పష్టం చేశారు. ఇప్పటికే లక్ష 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. తీరప్రాంతాల్లో భీతవాహ పరిస్థితి నెలకొందని ఆమె వెల్లడించారు. తుపాన్ తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం రెండ్రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
పునరావాసా కేంద్రాలకు తరలింపు
ఒడిషా ( Odisha), పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు బుల్‌బుల్ తుఫాను రూపంలో ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంగా గాలుల వీస్తాయని భారీ వర్షాలు(heavy rainfall) కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుల్‌బుల్ తుఫాను ప్రభావం ఒడిశాపై పడనుంది.
విశ్వరూపాన్ని చూపెడుతున్న బుల్‌బుల్
ఆ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశా తీరప్రాంతాలతో పాటు ఉత్తర జిల్లాల్లో కూడా రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇక-ఒడిషా తీరప్రాంతంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి 90 కిలోమీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉంది.