Helpline Number 139: ఇక నుంచి రైల్వేలో అన్నింటికి ఒకటే నెంబర్! ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ '139' ను ప్రారంభించిన రైల్వేశాఖ, అన్ని రకాల సేవలు మరియు విచారణలు ఇదే హెల్ప్‌లైన్ నంబర్‌కు అనుసంధానం
రైల్వేలో ఇదివరకే ఉన్న అనేక రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అన్నింటినీ (182 మినహా) 139 కే అనుసంధానం చేశామని, కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బంది లేదా సమస్య తలెత్తితే ఫిర్యాదు చేయడంగానీ, మరేదైనా విచారణల కోసం ఇక నుంచి 139....
New Delhi, January 3: భారతీయ రైల్వేస్ (Indian Railways) ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ "139" ను ప్రకటించింది. రైలు ప్రయాణ సమయంలో ఏదైనా సహాయం, విచారణ లేదా వేధింపులు మరియు ఇతరత్రా సమస్యలకు సంబంధించి ఉచిత 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేసి పరిష్కారం పొందవచ్చునని సూచించింది. ఫిర్యాదులు మరియు విచారణల కోసం రైల్వేలో ఇదివరకే ఉన్న అనేక రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అన్నింటినీ (182 మినహా) Integrated Helpline Number- 139 కే అనుసంధానం చేశామని, కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బంది లేదా సమస్య తలెత్తితే ఫిర్యాదు చేయడంగానీ, మరేదైనా విచారణల కోసం ఇక నుంచి 139 డయల్ (Dial 139) చేసి శీఘ్రమైన పరిష్కారం పొందవచ్చునని రైల్వేశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 139 ప్రారంభంతో గతంలో రైల్వేలో ఉన్న మిగతా హెల్ప్‌లైన్ నెంబర్లు నిలిపివేయనున్నారు. సాధారణ ఫిర్యాదుల కోసం ఉన్నటువంటి హెల్ప్‌లైన్ 138, ప్రమాదాలు మరియు భద్రత కోసం 1072, SMS ఫిర్యాదుల కోసం 9717630982, కోచ్‌ను శుభ్రపరచడానికి 58888/138, విజిలెన్స్ కోసం 152210, క్యాటరింగ్ సేవల కోసం 1800111321 హెల్ప్‌లైన్ నెంబర్లు ఉండేవి. ప్రస్తుతం ఈ హెల్ప్‌లైన్ నెంబర్లన్నింటినీ రైల్వేశాఖ నిలిపివేయనుంది. వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఆ సమస్యను అధిగమించడానికి, ఆ సేవలన్నింటికీ కలిపి సులభమైన ఏకైక 139 నెంబరును రైల్వేశాఖ ప్రకటించింది. ఈ హెల్ప్‌లైన్ పన్నెండు భాషలలో లభిస్తుంది. ఇది IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) పై ఆధారపడి పనిచేస్తుంది. రైలు టికెట్ ధరలను 'హేతుబద్ధీకరణ' చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపిన రైల్వే బోర్డ్
139 హెల్ప్‌లైన్ (IVRS) మెనూ గురించి కూడా భారతీయ రైల్వే సమాచారం ఇచ్చింది. 139కు డయల్ చేసిన తర్వాత భద్రత మరియు వైద్య సహాయం కోసం 1 నొక్కాలి, ఇది వెంటనే సంబంధిత కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు అనుసంధానిస్తుంది. ఏదైనా విచారణ కోసం 2 నొక్కాలి ఇందులో మళ్ళీ సబ్ సెక్షన్లు ఉంటాయి. పిఎన్ఆర్ స్థితి, రైలు రాక / బయలుదేరే సమాచారం, వసతి, ఛార్జీల విచారణ, టికెట్ బుకింగ్, సిస్టమ్ టికెట్ రద్దు, మేల్కొలపడానికి అలారం సౌకర్యం / గమ్యం హెచ్చరిక, చక్రం- కుర్చీ బుకింగ్, భోజన బుకింగ్ లకు సంబంధించిన సర్వీసులు ఇందులో వస్తాయి.
ఇక క్యాటరింగ్ ఫిర్యాదుల కోసం 3 నొక్కాలి, సాధారణ ఫిర్యాదుల కోసం 4 నొక్కాలి, విజిలెన్స్ సంబంధిత ఫిర్యాదుల కోసం 5 నొక్కాలి. ప్రమాదాలకు సంబంధించి విచారణల కోసం 6 నొక్కాలి, ఫిర్యాదుల స్టేటస్ తెలుసుకునేందుకు మరియు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడటానికి 9 నొక్కాల్సి ఉంటుంది.