Indian Railways: మీ బెర్త్ కన్ఫర్మ్! ఇక వెయిటింగ్ లిస్టులు, వెయిట్ చెయ్యడాలు ఉండవు. రైళ్లలో రోజూ 4 లక్షల అదనపు బెర్తులు.
సుమారు 5000 బోగీలను ఈ సరికొత్త టెక్నాలజీతో మార్పులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనివల్ల...
ఎమ్మెల్యే సీట్ అయినా దొరుకుతుందేమో గానీ, ట్రైన్‌లో బెర్త్ దొరకడం చాలా కష్టం. ఓ పండగ పబ్బం అని లేదు, వారం- వారాంతం అని లేదు ఎప్పుడు చూసిన రైళ్లలో 'బెర్తులు ఫుల్' అని దర్శనమిస్తాయి. ఒక్కోసారి మీ అందరికి అనిపించొచ్చు ఈ జనాలందరూ ఎక్కడ్నించి వస్తున్నారురా బాబూ అనీ. గుడ్ లక్ ఏంటంటే మీ ఫ్రస్ట్రేషన్‌ని రైల్వేశాఖ (Indian Railways) అర్థం చేసుకుంది.
మీ లాంటి ఫ్రస్ట్రేటెడ్ ప్రయాణికుల బాధలు తీర్చేందుకు ఈ అక్టోబర్ నుంచి ప్రతి రోజూ రైళ్లలో 4 లక్షల అదనపు బెర్తులను (Additional Berths) అందుబాటులో ఉంచుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.
ఎలా అంటే ప్రస్తుతం రైళ్లలో ఏసి, లైట్స్, ఫ్యాన్స్ పనిచేయటానికి అవసరమయ్యే విద్యుత్ కోసం పవర్ కార్లను వాడుతున్నారు. ప్రతీ రైలుకి డీజిల్‌తో నడిచే రెండు పవర్ కార్లు ఉంటాయి. అయితే ఈ పవర్ కార్ల స్థానంలో 'Head on Generation' అనబడే టెక్నాలజీని వాడుకలోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఇంజిన్ నడపటానికి ఉపయోగించే హైటెన్షన్ వైర్ల నుంచే ఇకపై అన్ని బోగీలకు విద్యుత్ సరఫరా చేయబోతున్నట్లు వెల్లడించారు. కాబట్టి రైళ్లలో వీలైనని అదనపు బోగీలను అమర్చుకోవటానికి అవకాశం ఏర్పడుతుందని ఈ రకంగా లెక్కిస్తే దాదాపు 4 లక్షలకు పైగా అదనపు బెర్తులు వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు, తద్వారా రైల్వేశాఖ ఆదాయం కూడా పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ అక్టోబర్ వరకు సుమారు 5000 బోగీలను ఈ సరికొత్త టెక్నాలజీతో మార్పులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనివల్ల డీజిల్ ఖర్చులు తగ్గి రైల్వేశాఖకు ఏడాదికి రూ. 6 వేల కోట్లు ఆదా కావడంతో పాటు రైళ్ల నుంచి వెలువడే కర్బన వ్యర్థాలను ఏడాదికి 700 మెట్రిక్ టన్నుల వరకు తగ్గించవచ్చునని అధికారులు పేర్కొన్నారు.