Kaleshwaram Project: తెలంగాణ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం నేటితో సాకారం. ఎన్నో వింతలు, విశేషాలు మరెన్నో అద్భుతాలు కలిగి ఉన్న ప్రాజెక్టుపై ఓ వివరణాత్మక కథనం.

మహరాష్ట్ర ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను కట్టి గోదావరిని ఒడిసిపట్టుకుంది.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం నిర్మించింది.

Kaleshwaram: తేదీ జూన్ 21, 2019 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అధ్యాయం. దశాబ్దాలుగా గొంతెండిన తెలంగాణ (Telangana) భూముల తడిఆరించేందుకు చేసిన ఓ మహోన్నత యజ్ఞం. అసాధ్యమనుకున్న పని సుసాధ్యం అయిన ఓ మహా అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైన సుదినం. అదే తెలంగాణ బాహుబలి ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం. ఈరోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దీనిని జాతికి అంకితం ఇచ్చారు.

మహారాష్ట్రలో ప్రారంభమయ్యే గోదావరి నది (Godavari River)  తెలంగాణాలో వివిధ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల మధ్య నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహరాష్ట్ర ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను కట్టి గోదావరిని ఒడిసిపట్టుకుంది.

ఈ గోదావరి నదీజలాల వినియోగంలో తెలంగాణ వాటా 954 టీఎంసీలు, అయినా ఈ వాటాలో కనీసం 10% కూడా వాడుకునే అవకాశం ఈ రాష్ట్రానికి లేకపోయింది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం కేవలం 90 టీఎంసీలు. నదీ ప్రవాహంతో వచ్చే మట్టివలన అది కూరుకుపోయి దాని సామర్థ్యం 40 టీఎంసీలకు పడిపోయింది. దీంతో చాలా వరకు నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయేది.

Kaleshwaram Project Introduction:

ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఈ పరిస్థితిని అధిగమించినట్లయింది. ఈ ప్రాజెక్టు తర్వాత ఇదే నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో 37 లక్షల ఎకరాలకు సాగునీరు, ఏడాదికి రెండు పంటలు అందించే లక్ష్యంతో, తెలంగాణలోని 13 జిల్లాల ప్రజలకు లబ్ది చేకూరేలా రూ. 80,500 కోట్ల భారీ వ్యవయంతో ఈ మహా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి 70% తాగునీటి అవసరాలను తీర్చనుంది.

ఎక్కడ నిర్మించారు?

 

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీని ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.

 

కాళేశ్వరం విశేశాలు ఏమిటి?

 

గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఎత్తిపోస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 3 టీఎంసిలు ఎత్తిపోసేలా ఇప్పటికే ప్రణాళిక.

కొన్ని వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జిపూల్) , భూగర్భం లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.

ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం - 80,500 కోట్లు

3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగం.

లబ్ది చేకూరే జిల్లాలు - 13 (106 మండలాలు)

నీటీ నిల్వసామర్థ్యం - 147 టీఎంసీ

హైదరాబాద్ తాగునీటికి అవసరాలకు 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కేటాయింపు.

గ్రామాల తాగునీటికి 10 టీఎంసీలు

ప్రాజెక్టు కింది భాగంలో ప్రధాన కాలువల (గ్రావిటీ కాలువలు) డిస్టిబ్యూషన్ పొడవు  1531 కి.మీ

సొరంగాల పొడవు - 203కి.మీ

మొత్తం పంపులు - 82

అవసరమయ్యే విద్యుత్తు - 4992 మెగా వాట్లు

నిర్మాణం కోసం సేకరించిన భూమి 80వేల హెక్టార్లు

అటవి భూమి - 3050హెక్టార్లు

ఏమిటీ దీని ప్రత్యేకత?

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ఆకాశ గంగను దివి నుంచి భువికి తీసుకురావడానికి ఆ భగీరథుడు ఎలాంటి ప్రయత్నం చేశాడో తెలియదు కానీ, కేసీయార్ హాయాంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం సాకారం అవడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నమే జరిగిందని చెప్పుకోవాలి.

తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతం, ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నదీజలాలు కాలువల్లోకి పంపించాలంటే మోటార్ల ద్వారా నీటిని తోడి కాలువల్లోకి పంపించాలి. ఇలా పంపించడాన్నే లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు. ఇప్పటివరకూ తెలంగాణలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ల పరిధి కేవలం 80 మీటర్లు మాత్రమే. అలాంటిది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 518 మీటర్ల ఎత్తుకు (మొదటి బ్యారెజ్ నుంచి చివరి బ్యారెజ్ వరకు మొత్తంగా), అదీ గోదావరి నదీ ప్రవాహానికి అభిముఖంగా వ్యతిరేక దిశలో నీటిని తరలించి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 5 వేల మంది ఇంజనీర్లు ఎంతో కష్టపడి పనిచేశారు.

సగటున రోజుకు 60 వేలమంది కఠోర శ్రమకోర్చారు.

తెలంగాణ ప్రభుత్వం , సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు రీడిజైన్ ఆలోచన చేసిన నాటి నుంచి దాదాపు రెండున్నరేళ్ళు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్టు ఎక్కడా ఆగకుండా ముందుకు నడిపించారు. గత టర్మ్ లో నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న హరీశ్ రావు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అహర్నిశలు శ్రమించారు. పనులన్నింటినీ తానే దగ్గరుండి చూసుకుంటూ  అనుకున్న సమయానికి పూర్తి చేయించడంలో ముఖ్యపాత్ర వహించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సమయంలో హారీశ్ రావు పడిన కష్టానికి కనీస గుర్తింపు దొరకలేదని ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి.



సంబంధిత వార్తలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్