Goodwin Jewellers Fraud Case: ముంబైలో మరో భారీ మోసం, గోల్డ్ స్కీమ్ పేరుతో జనాలకు టోకరా పెట్టిన గుడ్‌విన్ జ్యూయెలరీ సంస్థ, పరారీలో నిందితులు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్ ను ప్రజలకు ఆశగా చూపిన గుడ్‌విన్ జ్యూయెలరీ సంస్థ (Goodwin Jewellers), తమను నమ్మిన వారిని నట్టేట ముంచేస్తూ, బోర్డు తిప్పేసింది. దీంతో లక్షల రూపాయలు మోసపోయామంటూ పండుగ వేళ పెట్టుబడిదారులు రోడ్డెక్కారు.
Mumbai, october 28: మహారాష్ట్రలో మరో ఫ్రాడ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్ ను ప్రజలకు ఆశగా చూపిన గుడ్‌విన్ జ్యూయెలరీ సంస్థ (Goodwin Jewellers), తమను నమ్మిన వారిని నట్టేట ముంచేస్తూ, బోర్డు తిప్పేసింది. దీంతో లక్షల రూపాయలు మోసపోయామంటూ పండుగ వేళ పెట్టుబడిదారులు రోడ్డెక్కారు. ముంబైలోని గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని అనంతరం భారీగా టోకరా ఇచ్చారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన 50కి పైగా పెట్టుబడిదారులు ముంబైలోని రాంనగర్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గుడ్‌విన్ జ్యువెల్లరీ షాపులను సీజ్ చేశారు. సంస్థ యజమానులు ఇప్పుడు పరారీలో ఉండగా, ముంబై పోలీసులు కేసు నమోదు చేసి, వారు ఎక్కడున్నారో తేల్చే పనిలో పడ్డారు.
కేసు నమెదు చేసిన పోలీసులు
ముంబైకి చెందిన గుడ్ విన్ గ్రూప్ ఓ జ్యూయెలరీ షాప్ ను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు చైర్మన్ సునీల్ కుమార్, ఎండీ సుధీర్ కుమార్. ఇద్దరూ బంగారు ఆభరణాలపై పలు ఆఫర్లను ప్రచారం చేశారు. ఆకర్షణీయ పథకాలు, బంగారం, 16 శాతం వడ్డీ, ఇతర ఆఫర్లతో పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు. ఈ ఆఫర్లను చూసి చాలామంది రూ.2 వేల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడులు పెట్టారు.
సంస్థ ఎదుట బాధితుల ఆందోళన
అయితే అక్టోబర్ 21 నుంచి సంస్థ యజమానులు ఇద్దరూ కనిపించడంలేదు. షాపులు కూడా మూసివేశారు. వారి కుటుంబీకులు కూడా కనిపించడం లేదని గమనించిన 50 మందికి పైగా బాధితులు, రామ్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు జ్యూయెలరీ షాపులను సీజ్ చేశారు.
ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి పాస్ పోర్టు వివరాలను సేకరిస్తున్నామని, లుక్ అవుట్ నోటీసుల జారీకి అవకాశాలు ఉన్నాయని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సురేష్ అహెర్ తెలిపారు. వారి కోసం రైల్వే పోలీసులను, కంట్రోల్ రూమ్ ను, విమానాశ్రయం అధికారులను అప్రమత్తం చేశామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఒక్క డొంబివ్లి శాఖలోనే వెయ్యిమంది దాకా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఫ్రాడ్ విషయం వెలుగులోకి రావడంతో మరింతమంది బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు.
కేరళకు చెందిన గుడ్‌విన్ జ్యుయలరీ గ్రూప్‌నకు థానే, నవీముంబై సహా ముంబైలో 13 బ్రాంచీలున్నాయి. వీటిలో చాలావరకు ఇప్పుడు మూసివేయడం గమనార్హం. బాధిత పెట్టుబడిదారుల్లో కేరళనుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన వారే ఎక్కువని భావిస్తున్నారు.