18th Lok Sabha First Session: 50ఏళ్ల క్రితం నాటి పొరబాటు మళ్లీ పునరావృతం కాకూడదు, ఎమర్జెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
New Delhi, June 24: కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేస్తున్నారు. మొత్తం తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది.
ఏపీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఎంపీలు రెండోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. గిరిజనులు హిందువులో, కాదో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్టు చేస్తాం, రాజస్థాన్ బీజేపీ మంత్రి మదన్ దిలావర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఇదో అద్భుతమైన రోజు అంటూ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.
ఈ ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ (Narendra Modi)కి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ చరిత్రలో ఇదో అద్భుతమైన రోజు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం మన కొత్త పార్లమెంట్ (Parliament) భవనంలో జరగనుంది.
Here's Video
ఈ శుభ సమయాన కొత్తగా ఎన్నికైన సభ్యుల (Elected Candidates)కు స్వాగతాభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలు మా విధానాలను విశ్వసించారు. దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. సరికొత్త విశ్వాసంతో నేడు కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్ సంకల్పం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దాం’’ అని ఎంపీలకు పిలుపునిచ్చారు.
అత్యవసర పరిస్థితి ఏర్పడి రేపటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయింది. 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు’’ అని మోదీ (PM Modi) అన్నారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు చురకలంటించారు. ‘‘ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా. డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదు. నినాదాలు ఆశించట్లేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి’’ అని ప్రధాని హితవు పలికారు.