COVID in India: మహమ్మారి కొత్త రూపంతో దేశంలో కొత్త టెన్షన్, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,712 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 1,01,23,778కి చేరిన కొవిడ్ కేసుల సంఖ్య
New Delhi, December 24: మహమ్మారి SARS-CoV-2 కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు బ్రిటన్ మరియు యూరోపియన్ దేశాల గుండా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ కూడా ఈ ఏడాది చివరి వరకు UK నుండి విమానాలను నిలిపివేసింది. కాగా, ఇప్పటికే UK నుండి వచ్చిన ఐదుగురు COVID- పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత జాడలేకుండా పోయారు, వీరిలో ఒకరు లుధియానాకు చేరుకోగా, మరొకరు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. వీరిని ట్రేస్ చేసే పనిలో ఆరోగ్యశాఖ పనిచేస్తోంది, మిగతా ముగ్గురిని గుర్తించి దిల్లీ ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 24,712 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,01,23,778కు చేరింది. నిన్న ఒక్కరోజే 312 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,46,756కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29,791 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 96,93,173 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,83,849ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.75% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.80% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా 16,53,08,366 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,39,645 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 78.1 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు 1.71 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
గురువారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 78,011,432గా ఉండగా, మరణాలు 1,717,055కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.