Jammu Kashmir Update: కాశ్మీర్‌లో దిగ్భంధనం ఎత్తివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్ట్.

కమ్యూనికేషన్ పూర్తిగా నిలిపివేశారు. కేవలం అధికారులకు మాత్రమే శాటిలైట్ ఫోన్లను ఇచ్చి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు...

File image of the Supreme Court of India | (Photo Credits: PTI)

New Delhi, August 8: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో J&K మాజీ ముఖ్యమంత్రులైన మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను కేంద్ర ప్రభుత్వం వీవీఐపి గెస్ట్ హౌజ్ లో నిర్బంధించింది. అంతేకాకుండా అక్కడ ఫోన్లు, ఇంటర్నెట్ మరియు కేబుల్ సేవలను నిలిపివేసింది.

జమ్మూ కాశ్మీర్ లోని ప్రస్తుత పరిస్థితిని సవాల్ చేస్తూ దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త తెహసీన్ పూనవాల్లా సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భంధించిన మాజీ సీఎంలను వెంటనే విడుదల చేయాలని, అలాగే కాశ్మీర్ లో కమ్యూనికేషన్ పునరుద్ధరించాలని పిటిషన్ లో కోరాడు. అయితే సుప్రీం మాత్రం దీనిపై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పిటిషన్ ను తోసిపుచ్చింది. తగిన సమయంలో ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది.

కాశ్మీర్ విషయంలో కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడిన దగ్గర్నించి ఆ ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతుంది. కమ్యూనికేషన్ పూర్తిగా నిలిపివేశారు. కేవలం అధికారులకు మాత్రమే శాటిలైట్ ఫోన్లను ఇచ్చి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిత్యావసర సరుకులు, ఆరోగ్య సేవలకు ఎలాంటి లోటు రాకుండా చూస్తున్నారు.

అయితే ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాల్లో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు మరియు వారి కుటుంబీకులకు మధ్య ఆందోళన నెలకొంది. కాశ్మీర్ లో బంధువులు కలిగిన వారు కూడా తమ వారితో మాట్లాడలేకపోతున్నారు. అయితే వచ్చేవారం బకీద్ పండగ ఉన్న నేపథ్యంలో ఈ నిషేధాజ్ఞలు కొంత సడలించాలనే ఆలోచనలో అధికారులున్నట్లు తెలుస్తుంది.

బక్రీద్ పండగ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇదివరకే అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో పండగకోసం ఇంటికి వచ్చే వారి కోసం ప్రత్యేక రవాణా, ప్రతి వ్యక్తికి పండగకవసరమయ్యే అన్నింటిని అధికారులే కల్పించాలని భావిస్తున్నారు.

అయితే, గృహ నిర్భంధంలో ఉన్న మాజీ సీఎంలను ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో అంతా ప్రశాంతంగా ఉందని భద్రతాధికారులు పేర్కొన్నారు.