Anil Vij Tests Positive for Covid: వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చింది, హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్‌కు కోవిడ్ పాజిటివ్, భారత్ బయోటెక్ కోవాక్సీన్‌ను తీసుకున్న అనిల్ విజ్
భారత్ బయోటెక్ (Bharat Biotech) కోవాక్సీన్‌ను తీసుకున్న హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్ (Anil Vij Tests Positive for Covid) తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
New Delhi, December 5: వ్యాక్సిన్ బయటకు వచ్చిందని, కరోనా కంట్రోల్ అవుతుందనే దాని మీద ఆశలు చిగురుస్తున్న సమయంలో నిరాశాకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. భారత్ బయోటెక్ (Bharat Biotech) కోవాక్సీన్‌ను తీసుకున్న హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్ (Anil Vij Tests Positive for Covid) తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. అనిల్ విజ్ ఒక ట్వీట్‌లో తనకు కోవిడ్-19 టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అంబాలా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఈమధ్య కాలంలో తనతో టచ్‌లో ఉన్నవారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరుతున్నానన్నారు.
కాగా గత నవంబరు 20న దేశీయ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌లో అనిల్ విజ్ టీకా (COVID-19 Vaccine) తీసుకున్నారు. పీజీఐ రోహతక్ బృందం పర్యవేక్షణలో అనిల్ విజ్ అంబాలా కెంట్‌లోని ఆసుప్రతిలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం 30 నిముషాల పాటు అనిల్‌విజ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనికిముందు పీజీఐ రోహతక్ బృందం... మంత్రి అనిల్ విజ్ రక్త నమూనాను సేకరించింది. దేశీయ టీకా కోవాక్సిన్ మూడవ దశలో మొత్తం 200 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. ఇప్పుడు వారిలో యాంటీబాడీ అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నారు.
ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అంబాలా కాంట్ లోని సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు అనిల్ విజ్ తెలియజేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.