New Delhi, December 5: దేశంలో గడిచిన 24 గంటల్లోకొత్తగా 36,652 కరోనా వైరస్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. ఈ సంఖ్యతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211 దాటింది. ఈ మహమ్మారి నుంచి కొత్తగా 42,533 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 90,58,822 దాటింది. దేశంలో ప్రస్తుతం 4,09,689 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 94.28 శాతంగా ఉంది. కాగా 24 గంటల్లో కరోనాతో (Coronavirus Outbreak in India) కొత్తగా 512 మంది మరణించగా.. మొత్తం మరణించినవారి సంఖ్య 1,39,700గా ఉంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్–19 మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో 4.26 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) స్కూళ్లు తెరిచే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లే స్కూల్ మొదలుకొని 8వ తరగతి వరకూ స్కూళ్లను మార్చి 31 వరకూ తెరవకూడదని నిర్ణయించింది. దీనికితోడు ఈ ఏడాది ఐదవ తరగతి, ఎనిమిదవ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు.
మహారాష్ట్రలో 2,894 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరోనా (Maharashtra Coronavirus) సోకింది. వీరిలో 2,212 మంది టీచర్లు ఉండగా, 682 ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2,27,775 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరిలో 1,51,539 మంది టీచర్లకు కరోనా పరీక్షలు పూర్తికాగా, 2,212 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
మరోవైపు 92,343 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది ఉండగా, వీరిలో 56,034 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 682 మందికి కరోనా వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్ ఆఖరి వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రం కానున్న నేపథ్యంలో కరోనా మళ్లీ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందరు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించబోమని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది..