PM Modi at all-party meeting | (Photo Credits: ANI)

New Delhi, December 4: దేశంలో COVID-19 పరిస్థితిపై చర్చించడానికి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ పద్ధతిలో అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇక కరోనా వ్య్సాక్సిన్ కోసం ఎంతో కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, మరికొన్ని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తొలి దశ వ్యాక్సిన్ ఆరోగ్య సిబ్బందికి మరియు వయోవృద్ధులకు అందజేయబడుతుందని ఆయన అన్నారు.

"రాబోయే కొద్ది వారాల్లో COVID వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, టీకా భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు టీకాలు వేయడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది" అని PM మోదీ అన్నారు.

The World is Watching India: PM Modi

ప్రధాని ఇటీవల అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ ప్రకటన రావడంతో త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంపై ఆశలు చిగురిస్తున్నాయి.

వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని మోదీ అన్నారు.  వ్యాక్సిన్ ధరపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్రం ఒక నిర్ణయానికి వస్తుందని మోదీ తెలిపారు.  ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని మోదీ అన్నారు.

"మీ సూచనలను లిఖితపూర్వకంగా పంపమని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాటిని తీవ్రంగా పరిగణిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను" అని అఖిలపక్ష నేతలతో మోదీ అన్నారు.

కాగా, ఈ సమావేశానికి ముందు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "నేటి అఖిలపక్ష సమావేశంలో, ప్రతి భారతీయుడికి ఎప్పుడు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందో ప్రధాని స్పష్టం చేస్తారని మేము ఆశిస్తున్నాము." అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.