Arvind Kejriwal Bail Plea: ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్, తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, చరిత్రలో తొలిసారిగా పార్టీ పేరును నిందితులుగా పేర్కొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Delhi Excise Policy Scam Case)లో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
New Delhi, May 17: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Delhi Excise Policy Scam Case)లో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ‘వాదనలు విన్నాం. తీర్పును రిజర్వు చేశాం. అప్పీల్‌దారు చట్టానికి అనుగుణంగా బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లొచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇదిలా ఉంటే మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో తొలిసారి ఒక పార్టీ పేరును ప్రస్తావించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తోపాటు ఆయనకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితులుగా పేర్కొంది. కేజ్రీవాల్ జూన్ 2న కోర్టులో లొంగిపోవాల్సిందే, గెలిస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదన్న ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు
కేజ్రీవాల్ సెవెన్ స్టార్ హోటల్‌లో బస చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ కేసులోని నిందితుడు బిల్లులు కొంతవరకు చెల్లించినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.
మరోవైపు ఈ కేసులో నేరారోపణలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాటింగ్‌లను గుర్తించినట్లు సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ తన డివైజ్‌ల పాస్‌వర్డులు ఇచ్చేందుకు నిరాకరించారని చెప్పింది. అయితే హవాలా ఆపరేటర్ల డివైజ్‌ల ద్వారా ఆ చాటింగ్‌ల సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.
ఇదే కేసులో మార్చి 21వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. నాటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. అయితే ఎన్నికల వేళ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను ఇటీవల మంజూరు చేసింది. జూన్ 1వ తేదీతో సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియనుంది. దీంతో జూన్ 2వ తేదీన లొంగి పోవాలంటూ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసిన విషయం విధితమే.
ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ మంజూరుచేస్తున్నందున కేజ్రీవాల్ ఈ 21 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం/సచివాలయానికి వెళ్లరాదని, అధికారిక దస్త్రాలపై సంతకాలు చేయరాదని ధర్మాసనం షరతు విధించింది. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందడం తప్పనిసరి అయిన అత్యవసర దస్త్రాలపై సంతకం చేయడానికి మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టంచేసింది.