Ashwathama Reddy: తెలంగాణాలో కొనసాగుతున్న సమ్మె సస్పెన్స్, 12వ తేదీ నుంచి అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష, ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేయి కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ జేఏసీ
2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతున్న సంగతి విదితమే. ఇటు ప్రభుత్వం కాని, అటు కార్మికులు కాని మెట్టు దిగడం లేదు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తోంది.
Hyderabad, November 10: తెలంగాణా(Telangana)లో ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Strike) 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతున్న సంగతి విదితమే. ఇటు ప్రభుత్వం కాని, అటు కార్మికులు కాని మెట్టు దిగడం లేదు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తోంది. కేసీఆర్ సర్కారు ( KCR GOVT)కు కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు తనదైన శైలిలో వెళుతోంది. ఇదిలా ఉంటే ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఛలో ట్యాంక్ బండ్ ( Chalo Tankbund) ఆందోళనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై కార్మికులు భగ్గుమంటున్నారు.
పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో జరిగే ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొననున్నారు. మరోవైపు సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనల కార్యాచరణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది.
రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ప్రతిపక్ష నేతలతో జరిగిన సమావేశం అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి (Ashwathama Reddy) మీడియాతో మాట్లాడారు.
12న అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష
నవంబర్ 12వ తేదీ నుంచి నిరవధిక దీక్ష (Ashwathama Reddy Ready To Hunger Strike) చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా లింగమూర్తి, రాజిరెడ్డి, సుధలు దీక్షలో కూర్చొంటారని వెల్లడించారు. నవంబర్ 13 గురువారం, నవంబర్ 14వ తేదీ శుక్రవారం రోజుల్లో ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్, ఉమెన్ కమిషన్‌ను కలుస్తామన్నారు. ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగిన దమనకాండను వారికి వివరిస్తామన్నారు. ఓ ఫొటో ఎగ్జిబీషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నవంబర్ 18వ తేదీ సోమవారం రాష్ట్రం మొత్తం రహదారుల దిగ్భంద కార్యక్రమం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలన్నారు. సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తిడి తీసుకరావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేతలు వీహెచ్, మల్లు భట్టి విక్రమార్క, సీపీఎం నేతలు తమ్మినేని, వెంకట్, సీపీఐ నేత చాడ, విమలక్క తదితర నేతలు పాల్గొన్నారు.
మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నందునే అనుమతించలేదు : అంజనీకుమార్
కాగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ (HYD CP) సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదని హైదరాబాద్ సీపీ వివరించారు. పోలీసుల నిషేధం ఉన్నా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వారని సీపీ ఆరోపించారు.
వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఖండించారు.లేనిది తమకు ఆపాదించడం బాధాకరమని, కమిషనర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. గతంలో జరిగిన మిలియన్ మార్చ్‌లో ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదని గుర్తు చేశారు.
తాము శాంతియుతంగా గంటపాటు నిరసన వ్యక్తం చేస్తామని తెలిపితే..పోలీసులు నో చెప్పారని..ఇలా చేయడం తగదన్నారు. చలో ట్యాంక్ బండ్ పిలుపులో భాగంగా పోలీసులు ఆర్టీసీ కార్మికులను నిర్బందం చేసి వివిధ పీఎస్‌లకు తరలించారని, ఎంతో మంది గాయపడ్డారని వివరించారు.