CAA Notification: సీఏఏపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన అత్యున్నత ధర్మాసనం
మూడు వారాల్లోగా పిటీషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) కోరింది.
New Delhi, Mar 19: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సూప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ జరిపింది. మూడు వారాల్లోగా పిటీషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) కోరింది. ప్రస్తుతం సీఏఏ అమలుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో మళ్లీ ఏప్రిల్ 9వ తేదీన విచారణ ఉంటుందని సుప్రీం తెలిపింది.
సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్‌లో కోరిన విషయం తెలిసిందే. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా సీఏఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీఏఏ రూల్స్ PDF డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ఇదిగో, పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం
సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంలో 236 పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఇటీవల ఆ చట్టానికి చెందిన రూల్స్‌ను నోటిఫై చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయా పిటీషన్లలో సవాల్ చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీఏఏను సవాల్ చేస్తూ ఇండియన్ ముస్లిం లీగ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు.
1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2ను సవరించారు. దాని ప్రకారమే ఆఫ్ఘన్, బంగ్లా, పాక్‌లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సి, క్రైస్తవ మైనార్టీలకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. పొరుగు దేశాల్లో మతపరమైనవేధింపులకు గురవుతున్న వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఆ సవరణ రూపొందించారు.