One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం

ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

One Nation, One Election Explained: What Is It, How It Will Work Know More Details on Jamili Elections

New Delhi, Sep 19: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు.. అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2), ఆర్టికల్‌ 172(1), ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు చేయనున్నారు.

ఏమిటీ ఈ జమిలి ఎన్నికలు, దేశంలో ఇంతకుముందు జరిగాయా ? ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం ఇదిగో..

ఈ బిల్లు అమోదం పొందాలంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం అంటే.. 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

అసలు ఏమిటీ ఈ జమిలి ఎన్నికలు? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రా అసెంబ్లీలు, లోక్‌సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. మరి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయడం. మరికొన్నింటి కాలవ్యవధిని పొడిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

ఏమిటీ ఈ జమిలి ఎన్నికలు, దేశంలో ఇంతకుముందు జరిగాయా ? ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం ఇదిగో..

జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు ముందుగా పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు జరుగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2), ఆర్టికల్‌ 172(1), ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమవుతాయి.

జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బిల్లు, అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు

జమిలి ఎన్నికలపై ఏ ఆర్టికల్‌ ఏం చెబుతోంది.

ఆర్టికల్‌ 356: దీని ద్వారా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది.

ఆర్టికల్‌ 172 (1): దీని ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యవసర స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు.

ఆర్టికల్‌ 324: దీని ప్రకారం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి.రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి.

ఆర్టికల్‌ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం.. ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.

ఆర్టికల్‌ 83: ఇది పెద్దల సభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్‌.

వీటితో పాటు రాజ్యాంగంలోని 2,3 చాప్టర్స్‌, పార్ట్‌-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు కలిపి మొత్తం 18 అంశాలను జమిలి ఎన్నికల బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.

పార్లమెంట్ లో ఆమోదం ఎలా ఉంటుంది ?

జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశ పెడితే ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థించాలి. దీంతో పాటుగా ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు (14 రాష్ట్రాలు) ఆమోద ముద్ర వేయాలి.

మన దేశంలో జమిలి ఎన్నికలు ఇంతకుముందు జరిగాయా ?

1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రా అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తరువాత కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు గాడి తప్పాయి. 1951-52లో 90 శాతం పోలవగా, 1957లో 76 శాతం, 1967లో 67 శాతం పోలయ్యాయి.

జమిలి ఎన్నికలు నిర్వహణకు సమస్యలు ఏమిటీ

ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటే ఈవీఎంలు,వివీ ఫ్యాట్ యంత్రాలు, 25 లక్షలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం 12 లక్షలు మాత్రమే. కేంద్ర బలగాల కంపెనీలు ఆరు వేల వరకు అవసరం కాగా ప్రస్తుతం 1350 మాత్రమే ఉన్నాయి. పర్యవేక్షకులు కోటి మంది అవసరం కాగా ప్రస్తుతం 50 లక్షల మంది మాత్రమే ఉన్నారు.

ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్‌ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచడానికి తగినన్ని గోదాములు కూడా సమస్యగా మారింది. 15 ఏండ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్‌లైన్‌ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు.

ఖర్చు మాటేమిటీ ? 2009 లోక్‌సభ ఎన్నికలకు రూ. 1,115 కోట్లు, 2014లో రూ. 3,870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు పది వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి రూ. 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే, మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్దమొత్తంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

జమిలి కోసం అవిశ్వాస తీర్మానం పెడితే ఏమవుతుంది ? రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన లోక్‌సభ విధివిధానాల్లోని 198వ నిబంధనలో మాత్రమే ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని ఆ నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఆ ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.

1999లో లా కమిషన్‌ చేసిన సిఫారసు ఏమిటీ ? 1999లో లా కమిషన్‌ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు.తద్వారా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో తెలుస్తుంది. ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియమిస్తారు. దీని ప్రకారం.. ప్రభుత్వాలు మారినా ఐదేండ్ల పాటు సభ కొనసాగుతుంది. చిక్కేమిటంటే..జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉండటం, మనది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు.

జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది.