China Food Crisis: చైనాలో ఆకలికేకలు, ముందస్తుగా ఆహారం నిల్వ చేసుకోవాలని చైనా సర్కారు ఆదేశం, మరో సంక్షోభానికి దారి తీస్తుందని ప్రపంచదేశాల ఆందోళన
ప్రజలంతా ఇళ్లలో ఆహారం నిల్వ చేసుకోవాలని అలర్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వరదలు, రవాణాలో కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీస్తోంది.
Hong Kong, November 3: చైనాను మరో సంక్షోభం చుట్టుముట్టింది. ప్రజలంతా ఇళ్లలో ఆహారం నిల్వ చేసుకోవాలని అలర్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వరదలు, రవాణాలో కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత వచ్చే అవకాశముందని, చైనీయులు ముందుగానే సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని చైనా సూచించింది. అంతేకాదు పొట్టుతీయని ధాన్యాలు తినడాన్ని ప్రోత్సహించాలని, రవాణాలో కొరత కారణంగా పండ్లు, కాయగూరలను ఆరబెట్టి నిల్వచేసేందుకు డ్రైయ్యర్లను వినియోగించాలని కోరింది. కొరత ఎక్కువగా ఉన్న ధాన్యాలు, కూరగాయలను ఎంచుకొని రైతులు పండించాలని, యంత్రాలను వినియోగించి వృథాను కట్టడి చేయాలని సూచించింది.
ఏడాదిన్నర నుంచి చైనాలో ఆహార కొరతపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనా తీరప్రాంతాల్లో వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. దాంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కుంభవృష్టి కారణంగా చైనాలోని డ్యామ్‌లన్నీ పొంగిపొర్లడంతో….పంటలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసింది.
ఇక సిచువాన్ ప్రావిన్స్, షాంగ్జీ ప్రావిన్స్, హెనాన్ ప్రావిన్సులను ఇటీవల రికార్డు స్థాయి వరదలు ముంచెత్తాయి. ఫలితంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కూరగాయల హోల్‌సేల్ రేట్లు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయల రేట్లు మాంసం కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఇకముందు పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రజలను ఆహార వృథా చేయొద్దని హెచ్చరించింది చైనా ప్రభుత్వం.
అటు చైనాలో బొగ్గు కొరత కూడా పరోక్షంగా ఆహార సంక్షోభానికి దారి తీస్తోంది. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతులు నిలిపివేయంతో …..చైనాలో విద్యుత్ కొరత ఏర్పడింది. నగరాల్లో వీధుల్లో లైట్లు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. దీంతో చైనాలోని డీజిల్ నిల్వలను విద్యుత్తు ఉత్పత్తికి మళ్లించింది. ఇది మరో రూపంలో చైనాలో సమస్యను సృష్టించింది. వాహనాలకు ఇంధన కొరత తలెత్తింది. ఇంధన విక్రయాలపై రేషన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే ఆహార కొరత.. ఆపై రవాణా సౌకర్యాలకు తగినంత డీజిల్ లేకపోవడంతో ధరలు పెరిగాయి.
ఇక కరోనా డెల్టా వేరియంట్ విజృంభణతో పలు చోట్ల లాక్‌డౌన్ విధించారు. ఇది కూడా ఆహార సంక్షోభానికి కారణంగా మారింది. దీంతో ఆహార కొరతను నివారించేందుకు పలు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. చైనా సోషల్ మీడియాలో పోస్టు చేసే బింజ్ ఈటింగ్ వీడియోలు చేసేవారిపై, ఆహారాన్ని వృథా చేసేవారిపై చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు మీటింగ్‌ల పేరుతో విలాసవంతమైన భోజనాలను ఏర్పాటు చేయడాన్ని చైనా నిషేధించింది. పందులు, కోళ్ల పెంపకంలో సోయాబీన్, మొక్కజొన్నను వాడకుండా ధాన్యాలను ప్రాసెస్ చేసినప్పుడు లభించే ఉప ఉత్పత్తులను వాడాలని రైతులకు సూచించింది. ఆహార పదార్థాలతో బయో ఇంధనాలు తయారు చేసే సంస్థలపై ఆంక్షలు విధించింది.