Chinmayanand Rape Case: చిన్మయానంద్ కేసులో ట్విస్ట్, బాధితురాలు అరెస్ట్. డబ్బు డిమాండ్ చేస్తుందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ప్రత్యేక విచారణ బృందం

చిన్మయానంద్‌పై నమోదైన కేసును ఆసరాగా చేసుకొని బాధితురాలు వారిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేస్తునట్లుగా ఆమెపై....

Shahjahanpur law student, who alleged rape, addressing the press | File image | (Photo Credits: ANI)

Shahjahanpur, September 25: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత చిన్మయానంద్ (Chinmayanand) తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన 23 ఏళ్ల లా స్టూడెంట్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బుధవారం అరెస్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. చిన్మయానంద్‌పై నమోదైన కేసును ఆసరాగా చేసుకొని బాధితురాలు వారిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేస్తునట్లుగా ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు ఆమెపై కూడా కేసు నమోదు చేసిన  సిట్,  మంగళవారం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించి, ఆ తర్వాత వదిలిపెట్టింది, అయితే తాను బాధితురాలిని కావడం వల్ల  ఈ బ్లాక్ మెయిల్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించింది, కోర్టులో ఆమె పెట్టుకున్న పిటిషన్ గురువారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు బుధవారమే నిందితురాలి ఇంటికి వెళ్లి, ఆమెను అరెస్ట్ చేసి కొత్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తన పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు, నన్ను ఇంట్లో నుంచి లాక్కొని తీసుకెళ్లారు.  అడ్డుకున్న మా కుటుంబ సభ్యులను దుర్భాషలాడారంటూ బాధితురాలు ఆరోపించింది.

బ్లాక్ మెయిలింగ్ మరియు డబ్బు డిమాండ్ ఆరోపణలపై బాధితురాలితో పాటు ఆమె స్నేహితులుగా చెప్పబడుతున్న మరో ముగ్గురు సంజయ్ సింగ్, సచిన్ సెంగర్ మరియు విక్రమ్ అలియాస్ దుర్గేష్ లపై కూడా కేసును నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి పేరు "మిస్ ఎ" గా లిస్టులో ఏ4 నిందితురాలిగా చేర్చారు. ఈ నలుగురు కలిసి చిన్మయానంద్ లైంగిక సంబంధిత వీడియోలను ఆన్ లైన్ లో పెడతామని బ్లాక్ మెయిల్ కాల్స్ చేస్తూ  వారిని రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని చిన్మయానంద్ తరఫున కేసు నమోదు చేయడంతో 'సిట్' వీరిని అరెస్ట్ చేసి విచారిస్తుంది.

యూపీ డీజీపి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇదీ:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని ఎస్‌ఎస్‌ న్యాయ కాలేజీ చెందిన లా స్టూడెంట్,  చిన్మయానంద్‌ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద్‌, ఆ తర్వాత తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ఎదుట కూడా చెప్పింది. తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్‌ కూడా చేయించుకున్నాడని సదరు లా విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ పోలీస్ శాఖ, బాధితురాలు సమర్పించిన ఆధారాల ఆధారంగా సెప్టెంబర్ 20న చిన్మయానందను అదుపులోకి తీసుకున్నారు. సదరు బీజేపీ నేత నేరాలను అంగీకరించడంతో న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని విధించింది.