Coal Shortage in India: ఓ వైపు కరోనా..మరోవైపు దేశంలో విద్యుత్తు సంక్షోభం, బొగ్గు నిల్వలు తగ్గడానికి కారణాలను తెలిపిన కేంద్రం, బొగ్గు సంక్షోభం నెలల తరబడి కొనసాగవచ్చనే ఆందోళనలు

తీవ్రమైన బొగ్గు కొరతతో థర్మల్‌ ప్లాంట్లు ‘మూసివేత’ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒక్కో ప్లాంటు వద్ద బొగ్గు నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అత్యవసరంగా బొగ్గు (Coal Shortage in India) అందుబాటులోకి రాకపోతే.. ఉత్పత్తి ఆగిపోయి తీవ్ర సంక్షోభం (Power Crisis India 2021) నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది.

Coal Mine (Photo CRedits: IANS)

New Delhi, Oct 10: దేశంలో విద్యుత్తు సంక్షోభం తరుముకొస్తోంది. తీవ్రమైన బొగ్గు కొరతతో థర్మల్‌ ప్లాంట్లు ‘మూసివేత’ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒక్కో ప్లాంటు వద్ద బొగ్గు నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అత్యవసరంగా బొగ్గు (Coal Shortage in India) అందుబాటులోకి రాకపోతే.. ఉత్పత్తి ఆగిపోయి తీవ్ర సంక్షోభం (Power Crisis India 2021) నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 70 శాతం బొగ్గుతో నడిచే థర్మల్‌ ప్లాంట్ల నుంచే వస్తోంది.

వీటికి అవసరమైన మూడొంతుల బొగ్గును దేశీయంగా ఉన్న గనుల నుంచే తవ్వి తీస్తారు. మిగిలిన బొగ్గును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! భారీ వర్షాలతో దేశంలోని బొగ్గు గనుల్లో ఉత్పత్తి పడిపోయింది. రవాణా కూడా తగ్గిపోయింది. పలుదేశాల్లో పెరిగిన డిమాండ్‌తో అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. మన దేశానికి దిగుమతులూ తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఇండియా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కోనుంది.

దేశంలో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విద్యుత్తుకు అనూహ్యంగా డిమాండ్ పెరగడం, భారీ వర్షాలు, దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరగడం, వర్షాకాలానికి ముందు తగిన స్థాయిలో బొగ్గును నిల్వ చేసుకోకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితి వచ్చిందని విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో తరుముకొస్తున్న బొగ్గు సంక్షోభం, పారిశ్రామిక రంగంలో ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ డిమాండ్, ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానికి లేఖ రాసిన సీఎం కేజ్రీవాల్

విద్యుదుత్పత్తి ప్లాంట్లలో బొగ్గు కొరత గురించి ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ స్పందించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల ఉప సంఘం వారానికి రెండుసార్లు బొగ్గు నిల్వల పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది.

బొగ్గు నిల్వలు తగ్గడానికి కేంద్రం తెలిపిన నాలుగు కారణాలు

1. విద్యుత్తు డిమాండ్ మునుపెన్నడూ లేనంతగా పెరగడం.

2. 2021 సెప్టెంబరులో బొగ్గు గనుల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం.

3. దిగుమతి చేసుకునే బొగ్గు ధర మునుపెన్నడూ లేనంత భారీగా పెరగడం.

4. వర్షాకాలం ప్రారంభమవడానికి ముందు తగిన స్థాయిలో బొగ్గు నిల్వ చేసుకోకపోవడం.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల విద్యుత్తు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని తెలిపింది. గనుల ప్రాంతాల్లో వర్షాలు కురవడం వల్ల బొగ్గు తవ్వకం, రవాణాలో ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది. ఫలితంగా విద్యుదుత్పత్తి తగ్గినట్లు పేర్కొంది. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు బొగ్గు కంపెనీలకు పెద్ద ఎత్తున బాకీపడినట్లు తెలిపింది.

దేశంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో సగటున 3 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 135 థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండగా.. వీటిలో 17 ప్లాంట్లలో ఇప్పటికే బొగ్గు నిల్వలు ఖాళీ అయిపోయాయి. 21 ప్లాంట్లలో మరొక్క రోజులో ఖాళీ అయిపోతాయి. 18 ప్లాంట్లలో 2 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. మిగిలిన వాటిలో అటూఇటుగా వారానికి సరిపడా బొగ్గు అందుబాటులో ఉందని కేంద్ర విద్యుత్తు అథారిటీ(సీఈఏ) తెలిపింది.

ఏపీలో ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో ఒప్పందాలను వాడుకోలేని స్థితిలో ఉన్నామని లేఖలో వెల్లడి

కరోనా’ తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత జాతీయంగా, అంతర్జాతీయంగా మళ్లీ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. విద్యుత్తుకు డిమాండ్‌ పెరిగింది. 2019తో పోలిస్తే గత రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం ఏకంగా 17శాతం పెరిగింది. అదే సమయంలో బొగ్గుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. విద్యుత్తుపై స్వయంగా కేంద్రమే ‘ప్రమాద ఘంటికలు’ మోగించింది. బొగ్గు సంక్షోభం నెలల తరబడి కొనసాగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితి ‘అసాధారణం’గానే ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మరో ఐదారు నెలలు కొనసాగవచ్చన్నారు. దేశంలో బొగ్గు కొరత సాధారణం కంటే అధికంగా ఉందని, అయితే ఇది విద్యుత్తు సంక్షోభానికి దారితీయదని తెలిపారు. కొద్దిరోజుల్లోనే డిమాండ్‌కు తగినట్లు బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గుతున్నందున రవాణా క్రమంగా మెరుగవుతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. మూడు నాలుగు రోజుల్లోనే బొగ్గు ఉత్పత్తి సాధారణ స్థితికి వస్తుందని బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొనడం గమనార్హం. దిగుమతి చేసుకునే బొగ్గు ధర ఒక్కసారిగా భగ్గుమందని.. కేవలం ఆ బొగ్గుపై ఆధారపడే థర్మల్‌ ప్లాంట్లు ఉత్పత్తిని ఆపివేశాయని చెప్పారు.

విద్యుత్తును జాగ్రత్తగా వినియోగించాలని కోరుతూ టాటా పవర్‌ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌(టీపీడీడీఎల్‌) తన వినియోగదారులకు శనివారం ఎస్సెమ్మెస్ లు పంపించింది. బొగ్గు సరపరా పరిమితంగా ఉన్నందున మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకూ విద్యుత్తు సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుందని, కరెంటును పొదుపుగా వాడాలని సూచించింది. బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని కోరింది. విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లకు బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీలో ‘బ్లాక్‌ అవుట్‌’ ప్రకటించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ స్పష్టం చేశారు.

నెల రోజులకు సరిపడా నిల్వలు ఉండాల్సిన ప్లాంట్ల వద్ద ప్రస్తుతం ఒక్కరోజుకు సరిపడా నిల్వ మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌కు కృత్రిమ కొరత సృష్టించినట్లుగానే ఈ విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని జైన్‌ ఆరోపించారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకోని బొగ్గు, గ్యాస్‌ సరఫరా చేయాలని కోరారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు యూనిట్‌ ధర రూ.20కి పెంచారని, దాన్ని నియంత్రించాలని విన్నవించారు.

ఒడిసాలో పరిశ్రమలు ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని, వాటికి వెంటనే తగినంత బొగ్గు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉత్కళ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌(యూసీసీఐ) ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాసింది. ఒడిసాలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 65ు ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని, దీనివల్లే ఇక్కడి పరిశ్రమలు కొరతను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.

తెలంగాణలో జెన్‌కో పరిధిలోని భద్రాద్రి ప్లాంట్‌(540 మెగావాట్ల సామర్థ్యం)లో నాలుగు రోజులకు సరిపడా నిల్వలుండగా.. వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న కేటీపీఎస్‌ 5,6 ప్లాంట్లు.. 1200 మెగావాట్ల సామర్థ్యమున్న ఎస్‌టీపీపీలో 5 రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయి. కేటీపీఎ్‌స-7లో ఎనిమిది, కేటీపీపీలో 13 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. నిల్వలు పూర్తవ్వగానే థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు వాటంతట అవే షట్‌డౌన్‌ అవుతాయి. దీంతో జలవిద్యుత్తు కేంద్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

భూపాలపల్లిలోని జెన్‌కో ప్లాంట్‌లో 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. ఏపీ జెన్‌కోకు చెందిన రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ముద్దనూరు), విజయవాడలోని ఎన్‌టీటీపీఎస్‌, విశాఖపట్నంలోని ఎన్టీపీసీ-సింహాద్రి థర్మల్‌ కేంద్రాలలో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. తమిళనాడులో ఎన్‌టీపీసీకి చెందిన కుడ్గి ప్లాంట్‌లో ఒక్క రోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి.

తీవ్ర బొగ్గు కొరత కారణంగా పంజాబ్‌లోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు విద్యుత్తు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తెలిపింది.

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌కూ.. ఉత్పత్తికి మధ్య 20ు వ్యత్యాసం ఉందని విద్యుత్తు వాడకంలో పొదుపు పాటించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు రూ.14, పీక్‌ సమయంలో యూనిట్‌కు రూ.20 చొప్పున చెల్లించి కరెంటు కొంటున్నామని తెలిపింది. ఉదయం 6నుంచి 9 గంటలు - సాయంత్రం 6 నుంచి రాత్రి 10గంటల మధ్య ఏసీల వాడకాన్ని నిలిపేయాలని ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌. శ్రీకాంత్‌ ప్రజలను కోరారు.

థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలలో బొగ్గుతోపాటు బయోమాస్‌ పెల్లెట్లు మండించి ఉత్పత్తి చేయాలని జెన్‌కోలను కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశించింది. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు విధిగా 25 ఏళ్లపాటు బయోమాస్‌ పెల్లెట్లను వినియోగించాలనే నిబంధనను గుర్తుచేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బయోమాస్‌ పెల్లెట్ల ధర టన్నుకు రూ.5500ల దాకా ఉంది. ఆ మేరకు చార్జీల రూపంలో వసూలుకు వెసులుబాటు ఇచ్చారు.