Amaravati, Oct 9: థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ఒప్పందాలను వాడుకోలేని స్థితిలో ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) అన్నారు. ఈ మేరకు ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. కొవిడ్ తర్వాత 20 శాతం మేర వినియోగం పెరిగిందన్నారు. బొగ్గు కొరతతో (Coal Shortage) విద్యుత్ ప్లాంట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు.
ఏపీ జెన్‌కో 45 శాతం రాష్ట్ర అవసరాలను మాత్రమే తీర్చగలుగుతోందని వివరించారు. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల వద్ద ఒకట్రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏపీలోని థర్మల్ కేంద్రాల్లో రోజుకు 90 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం 50 శాతమే జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రోజుకు 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి సాధ్యం అవుతుంది. 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ఉన్న ఒప్పందాలను రాష్ట్రం వినియోగించుకోలేని పరిస్థితిలో ఉందని సీఎం లేఖలో తెలిపారు.
బొగ్గు కొరత కారణంగా మార్కెట్‌లో ఇంధన ధరలు బాగా పెరిగాయి. రియల్ టైమ్ విద్యుత్ కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం యూనిట్ ధర రూ.20కి పెరిగింది. కొన్నిసార్లు ఈ ధరకైనా విద్యుత్ అందుబాటులో ఉండటం లేదు. ఇవి డిస్కంల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిన సమయం. ఈ తరుణంలో విద్యుత్ కోతలు ఇబ్బందులకు దారి తీస్తున్నాయి. 2012లోనూ ఈ తరహా సంక్షోభాన్ని వ్యవసాయ రంగం చవిచూసిందని తెలిపారు.
విద్యుత్ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 20 ర్యాక్‌ల బొగ్గును పంపేందుకు వీలుగా రైల్వే శాఖను ఆదేశించాలి. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన ప్లాంట్లను నడిచే విధంగా ఎన్‌సీఎల్‌టీలో నిర్ణయం తీసుకోవాలి. అత్యవసర ప్రాతిపదికన నిలిచిపోయిన 2,300 మెగావాట్ల గ్యాస్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పనిచేయించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఓఎన్‌జీసీ, రిలయన్స్ సంస్థల వద్ద తగినంత సహజ వాయివు అందుబాటులో ఉంది. విద్యుత్ సంక్షోభాన్ని తీర్చేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలి’’ అని లేఖలో సీఎం జగన్ కోరారు.