Corporate Tax Slashed: దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపు పన్ను చట్టంలో స్వల్ప సవరణలు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

"వృద్ధిని ప్రోత్సహించం కోసం, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో ఒక కొత్త నిబంధన చేర్చబడింది, ఈ నిబంధన ప్రకారం ఏ దేశీయ కంపెనీకి అయినా కేవలం 22 శాతం మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించడానికి అనుమతించబడుతుంది....

Union Finance Minister Nirmala Sitharaman (Photo Credits: ANI)

New Delhi, September 20:  ఆర్థిక మందగమనం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతూ వస్తుంది. తాజాగా తయారీ రంగంలో గల దేశీయ కంపెనీలు చెల్లించే కార్పోరేట్ టాక్సులలో సవరణలు చేయనున్నారు. దేశీయ కంపెనీలకు మరియు భారత దేశంలో తయారీ ప్రారంభించాలనుకునే కొత్త సంస్థలకు కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  (Nirmala Sitharaman) శుక్రవారం ప్రకటించారు. కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేస్తామని నిర్మల సీతారామన్ తెలిపారు. దేశీయ కంపెనీలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను (MAT- Minimum Alternate Tax) ను కూడా ప్రభుత్వం తగ్గిస్తోందని సీతారామన్ తెలిపారు.

సీతారామన్ మాట్లాడుతూ "వృద్ధిని ప్రోత్సహించం కోసం, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో ఒక కొత్త నిబంధన చేర్చబడింది, ఈ నిబంధన ప్రకారం ఏ దేశీయ కంపెనీకి అయినా కేవలం 22 శాతం మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించడానికి అనుమతించబడుతుంది. అయితే సదరు కంపెనీ ప్రభుత్వం నుండి ఇప్పటికే ఏ విధమైన ప్రోత్సాహకాలు లేదా మినహాయింపులు కలిగి ఉంటే ఈ టాక్స్ రేట్ వర్తించదు " అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనీస ప్రత్యామ్నాయ పన్నును కూడా 3.5 శాతం తగ్గించారు.

"ఇప్పటికే ఇన్సెంటివ్స్ లేదా మినహాయింపులు పొందుతున్న సంస్థలకు కూడా కొంతవరకూ రిలీఫ్ ఇచ్చేందుకు కనీస ప్రత్యామ్నాయ పన్నును తగ్గిస్తున్నాము. అలాంటి సంస్థలకు ప్రస్తుతమున్న మినిమమ్ టాక్స్ రేటు 18.5 శాతం నుండి 15 శాతానికి తగ్గించబడింది" అని సీతారామన్ తెలిపారు. అలాగే ఒక సంస్థలో ఈక్విటీ వాటా అమ్మకం లేదా ఈక్విటీ-ఓరియెంటెడ్ ఫండ్ యొక్క యూనిట్ ద్వారా వచ్చేటువంటి మూలధన లాభాలపై కూడా మొన్నటి కేంద్ర బడ్జెట్ 2019లో ప్రకారం పెంచినటువంటి సర్‌ఛార్జీలు కూడా లేకుండా చేస్తున్నామని సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాత సర్‌ఛార్జీలే వర్తించనున్నాయి.  విదేశీ పోర్ట్‌ఫోలియో కలిగిన పెట్టుబడిదారులకు కూడా క్యాపిటల్ గెయిన్స్ అమ్మకం వల్ల కలిగే మూలధన లాభాలపై కూడా కొత్తగా పెంచిన సర్‌చార్జీలు వర్తించవని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.

భారీ  లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్ను తగ్గింపు ప్రకటన నేపథ్యంలో  శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ  లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1,930 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 38,023.69 వద్ద కొనసాగుతుంది, నిఫ్టీ 560 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 11,265 వద్ద గత పదేళ్ల గరిష్టానికి చేరుకుంది. దేశీయ పెట్టుబడిదారుల సంపద ఒక్కసారిగా రూ. 2 లక్షల కోట్లకు పెరిగింది. ఇటు రూపాయి కూడా కొద్దిగా బలపడి, ఒక డాలర్ తో మారకం విలువ ప్రస్తుతం రూ. 70.95 వద్ద ఉంది.