
Hyderabad, March 07: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ (OTS) పథకాన్ని ఉపయోగించుకొని నగరంలోని ఆస్తి పన్ను మొండి బకాయిలున్న వారు పన్ను చెల్లించాలని సూచించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. గతేడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ వల్ల సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు. జీహెచ్‌ఎంసీ.. ఈ సారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ.2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఓటీఎస్‌కు అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని భావిస్తోంది.