COVID-19 Vaccine: ఒక్క వ్యాక్సిన్ కోసమే రూ. 51 వేల కోట్లు పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కో వ్యక్తికీ సగటున రూ.450-550 వరకు ఖర్చవుతుందని అంచనా
అందరికీ టీకాలు వేయటానికి రూ.51,592 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టి, ఆ మేరకు నిధులను సమీకరించారని వెల్లడించాయి.
New Delhi, October 22: భారత్‌లో మొత్తం జనాభాకు కరోనా టీకాలు (COVID-19 Vaccine) ఉచితంగా వేయటానికి కేంద్రప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇప్పటికే సిద్ధం చేసిందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అందరికీ టీకాలు వేయటానికి రూ.51,592 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టి, ఆ మేరకు నిధులను సమీకరించారని వెల్లడించాయి. ఒక్కో వ్యక్తికీ సగటున రూ.450-550 వరకు ఖర్చవుతుందని, ఈ లెక్కన 130 కోట్ల మందికి ఎంతవుతుందని లెక్క గట్టి తాత్కాలికంగా ఈ మొత్తాన్ని (Nearly Rs 51,000 Crore to Vaccinate All Citizens) సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే మార్చి 31తో పూర్తయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఈ మొత్తమని, ఆ తరువాత కూడా వ్యాక్సిన్ కోసం నిధుల కొరత ఉండబోదని ఉన్నతస్థాయి వర్గాలు వివరించాయి.
కొవిడ్ టీకాపై ఏర్పాటుచేసిన వర్కింగ్ గ్రూప్ అంచనా ప్రకారం కరోనా వాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కో వ్యక్తికి టీకా (రెండు ఇంజెక్షన్లు) వేయటానికి రూ.147 (రెండు డాలర్లు) అవసరం. వాక్సిన్ స్టోరేజీ, రవాణాకు మరో రూ.147-221 (రెండు నుంచి మూడు డాలర్లు) ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. కాగా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా ప్రయోగాలు సవ్యంగా సాగుతున్నాయని ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) భారీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఒక బిలియన్ మోతాదులను తయారు చేస్తున్నట్టు సీరం సీఈఓ అదార్ పూనావల్లా తెలిపారు. అలాగే 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్‌ను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.2021-22 ముగిసేలోపు ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవోవాక్స్, కోవివాక్స్, కోవి-వాక్, ఎస్ఐఐ కోవాక్స్ అనే ఐదు వేర్వేరు కరోనావైరస్ వ్యాక్సిన్లకు సంబంధించి వందకోట్ల మోతాదులను సిద్ధం చేయనున్నామని పూనావల్లా చెప్పారు.
'కోవిషీల్డ్' కరోనావైరస్ వ్యాక్సిన్‌తో ప్రారంభించి, సీరం 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. 20-30 మిలియన్ మోతాదులను ఇప్పటికే తయారు చేస్తున్నామనీ దీన్ని నెలకు 70-80 మిలియన్లకు పెంచనున్నామని పూనావల్లా తెలిపారు.
బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంయక్తంగారూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,600 మందిలో క్లినికల్ ట్రయల్ 3వ దశలో ఉంది. దీని తయారీకి సంబంధించి ఇప్పటికే సీరం ఒప్పంద భాగస్వామ్యం చేసుకుంది. రెండవ వ్యాక్సిన్ బయోటెక్ సంస్థ నోవోవాక్స్ కు చెందిన 'కోవోవాక్స్'. దీని ఫేజ్-1 క్లినికల్ ట్రయల్ మే 2020 లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ 2020 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. నోవోవాక్స్ 2021 లో ఒక బిలియన్ మోతాదులను ఉత్పత్తికి సీరం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.