Cyclone Asani: తీరం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీలో కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు
అసని తుఫాను కల్లోలం రేపడానికి తీరం వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో (Deep Depression During Next 12 Hours) తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది.
New Delhi, March 20: దేశాన్ని వణికించడానికి ఈ ఏడాది తొలి తుఫాన్ (Cyclone Asani) రెడీ అయింది. అసని తుఫాను కల్లోలం రేపడానికి తీరం వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో (Deep Depression During Next 12 Hours) తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతున్న అల్ప పీడనం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. మరో 12గంటల్లో ఇది అసని తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ (IMD) అంచనా వేసింది.
ఏదేమైనా తుపాన్ ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుఫాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని పేర్కొన్నారు.