Cyclone Fengal: నెల్లూరు, తిరుపతి జిల్లాలను వణికిస్తున్న ఫెంగల్ తుఫాను, సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు.
Chennai, Nov 27: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి సౌదీ అరేబియా సూచించిన ‘ఫెంగల్’ అని నామకరణం చేయనున్నారు. ఈ తుఫాను గురువారం రాత్రి చెన్నై సమీపంలోకి రావొచ్చని, శనివారం చెన్నై - పుదుచ్చేరి(Chennai - Puducherry) మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ తుఫాను మొదట చెన్నై - నాగపట్టణం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేయగా, ప్రస్తుతం ఈ తుఫాను దిశ మార్చుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై - పుదుచ్చేరి మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ భావిస్తోంది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వుంది. అలలు ఐదడుగుల ఎత్తుకుపైగా ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొద్దని వాతావారణ శాఖ అధికారులు సూచించారు.
ప్రస్తుతం ఇది బుధవారం సాయంత్రానికి నాగపట్టణానికి 370 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిమీ, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైవుంది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా, రాయలసీమలోని తిరుపతి జిల్లాలు ఈ తుఫాను ప్రభావంతో ముప్పు ముంగిట్లోకి వెళ్లాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
దీని ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. శుక్రవారం వరకు తుపాను తీవ్రత కొనసాగుతుందని, శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్ఠంగా గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్‌కుమార్ పేర్కొన్నారు.
సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.