Dasara Holidays: దసరా సెలవులను ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. తెలంగాణలో 16 రోజులు, ఆంధ్ర ప్రదేశ్‌లో 12 రోజుల పాటు దసరా సెలవులు
అక్టోబర్ 10న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించింది....
Hyderabad, Amaravathi, September 18: ఈ ఏడాది అక్టోబర్ 6న దుర్గాష్టమి, అక్టోబర్ 7న మహర్నవమి మరియు అక్టోబర్ 8న విజయ దశమి పర్వదినాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అతిపెద్ద పండుగలైన దసరా, బతుకమ్మ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు 16 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తిరిగి అక్టోబర్ 14న తరగతులు పున:ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ దసరా సెలవులు రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయి. సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నడిపే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విద్యాశాఖ హెచ్చరించింది.
ఇక జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 09 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది. అక్టోబర్ 10న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇవే సెలవులు వర్తించనున్నాయి.
ఇటు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కూడా దసరా సెలవులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 09 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తిరిగి అక్టోబర్ 10న తరగతులు పున:ప్రారంభమవుతాయని తెలిపింది. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని రాష్ట్రంలోని ప్రవేట్ విద్యాసంస్థలను విద్యాశాఖ హెచ్చరించింది.
కాగా, ఏపిలో ఈ దసరా సెలవులను అక్టోబర్ 13వరకు పొడగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అక్టోబర్ 12 మరియు 13 తేదీలలో వరుసగా రెండో శనివారం, ఆదివారం వస్తున్నందున మధ్యలో 10, 11 తేదీలను కూడా సెలవులుగా ప్రకటిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉద్యోగ సంఘాల అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.