P. Chidamabaram Sent To Tihar Jail. ఇది అసలైన షాక్! తీహార్ జైలుకు పి. చిదంబరం. ఆయన పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు.

కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చిదంబరం తరఫు న్యాయవాదులు వాదించారు.

P Chidambaram in CBI custody (Photo Credits: IANS)

New Delhi, September 05:  INX మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం (P. Chidambaram) తిహార్ జైలు (Tihar Central Jail)కు పంపబడ్డారు. ఈమేరకు సెప్టెంబర్ 19వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువరించింది.

సిబీఐ కస్టడీ ముగియడంతో ఆయనను ఈరోజు ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరచారు. ఆయన పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ అజయ్ కుమార్ చిదంబరంకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పువెలువరించారు. జెడ్-సెక్యూరిటీ గల నాయకుడు కాబట్టి చిదంబరంకు జైలులో ప్రత్యేక గది మరియు సరైన రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్ట్ అంగీకరించింది, చిదంబరం జైలులోని ప్రత్యేక సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆయనకు అవసరమయ్యే మందులు కూడా వెంట తీసుకెళ్లేందుకు కోర్ట్ అనుమతించింది. కాగా, జైలులో ఆయనకు తగ్గ భద్రత కల్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకు కార్తీ ఎన్నో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో గత నెల ఆగష్టు 21న అరెస్టయిన చిదంబరం అప్పట్నించీ సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఇన్నాళ్లు సీబీఐ గెస్ట్ హౌజ్ లో ఈయనపై విచారణ జరిగింది. అయితే కోర్టు తాజాగా జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఇక చిదంబరం తీహార్ జైలులో 14 రోజుల పాటు ఈ కోసులో విచారణను ఎదుర్కోనున్నారు. అయితే చిదంబరం తరఫు న్యాయవాదులు ఈ తీర్పును మళ్లీ సుప్రీం కోర్టులో సవాలు చేస్తారో లేదో చూడాలి. తనను ED అరెస్ట్ చేయకుండా ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజే సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

అంతకుముందు ప్రత్యేక కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నప్పుడు నిందితుడు బెయిల్ పై విడుదలతే సాక్ష్యాధారాలను దెబ్బతీస్తాడు అని సీబీఐ చెప్తుంది అంటే ఈ కేసుకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చిదంబరం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే కోర్టు మాత్రం సీబీఐ వాదనలతోనే ఏకీభవించింది.