Chillara Donga: గోడకు కన్నం వేసి రూ.487/- దోచుకెళ్లిన ఘరనాదొంగ, ఆశ్చర్యచకితులైన పోలీసులు, ఆ దొంగ చిన్న పిల్లవాడు అయి ఉంటాడని అనుమానం, దర్యాప్తు ప్రారంభం
తమ పోస్టాఫీసులో దొంగలు పడ్డారు అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలిసులు దొంగలు దోచుకెళ్లిన మొత్తాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అయితే....
New Delhi, January 1: ఓ గజదొంగ, ఓ ఘరనాదొంగ 4 వందల రూపాయలు దోచుకెళ్లిన ఘటన, సంఘటన గురించి మీరెప్పుడైనా వినారా? అలాంటి దొంగలను మీరెక్కడైనా చూశారా? కానీ, అలాంటోడు ఒకడు ఉన్నాడు. ఎక్కడంటే దేశరాజధాని దిల్లీలో.
ఒకసారి దిల్లీ వెళ్లి ఆ భారీ దోపిడికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే. తూర్పు దిల్లీలోని శారద జిల్లాలో గల మానస సరోవర్ పార్క్ సమీపంలోని ఒక పాత భవనంలో పోస్టాఫీసు (Sharada Post Office) నడుస్తుంది. అందులో పెద్దమొత్తంలో డబ్బు దొరుకుతుందని ఆశించిన ఓ దొంగ, ఆ పోస్టాఫీస్ దోపిడికి (Robbery) భారీ పథకం రచించాడు. మొన్న సోమవారం రాత్రి ఆ పోస్టాఫీస్ గోడకు రంధ్రం చేసి, లోపలికి చొరబడ్డాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ దొంగకు కేవలం 487 రూపాయలు మాత్రమే ఒకచోట కనిపించాయి. అంతమొత్తంలో డబ్బు చూసి ఆ దొంగ తీవ్ర నిరాశకు లోనై ఉంటాడు. కానీ ఎంతైతే అంత అన్నట్లుగా ఆ 487 రూపాయలనే ఎత్తుకెళ్లాడు. ఘరనాదొంగ తన స్థాయి తగ్గించుకొని చిల్లరదొంగగా చెడ్డపేరు తెచ్చుకున్నాడు.
మరుసటి రోజు, పోస్టాఫీస్ తెరిచి చూసిన సిబ్బంది షాక్. తమ పోస్టాఫీసులో దొంగలు పడ్డారు అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలిసులు దొంగలు దోచుకెళ్లిన మొత్తాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అయితే అక్కడే ఉన్న రూ.5 వేల మూటను దొంగలు అసలు ముట్టుకోకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గోడకు రంధ్రం చిన్నగా ఉండటం, తక్కువ మొత్తాన్ని ఎత్తుకెళ్లడం అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ దొంగ ఎవరైనా చిన్నపిల్లవాడై ఉంటాడని , లేదా ఏదైనా ముఠా చిన్న పిల్లాడిని ఉపయోగించుకుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోస్టాఫీసులో, చుట్టుపక్కల ఎక్కడా సీసీకెమెరాలు లేకపోవడం గమనార్హం.