Draft Expat Quota Bill: ఎడారి దేశంలో భారతీయుల ఘోష, కువైట్‌లో 8 లక్షల మంది ఇండియన్ల పాలిట శాపం కానున్న ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు, ఆమోదం పొందితే దేశం వదలాల్సిందే
దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. కువైట్‌లో బయటి దేశాల వ్యక్తుల సంఖ్యలను తగ్గించుకునేందుకు తీసుకొచ్చిన ‘ప్రవాసీ కోటా’ ముసాయిదా బిల్లుకు (Draft Expat Quota Bill) కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మన దేశానికి చెందిన దాదాపు 8లక్షల మంది పనులు లేక వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
New Delhi, July 7: ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు (Indians) పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. కువైట్‌లో బయటి దేశాల వ్యక్తుల సంఖ్యలను తగ్గించుకునేందుకు తీసుకొచ్చిన ‘ప్రవాసీ కోటా’ ముసాయిదా బిల్లుకు (Draft Expat Quota Bill) కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మన దేశానికి చెందిన దాదాపు 8లక్షల మంది పనులు లేక వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వర్కర్లకు ఇచ్చే వీసాలు రద్దు, అమెరికా ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్
కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు (Kuwait approves expat quota bill) దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించడంతో త్వరలోనే అక్కడి భారతీయులు కువైట్‌ను వదిలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో చమురు ధరలు తగ్గిపోవడంతో కువైట్ ఈ బిల్లును రూపొందించింది. బిల్లుకు చట్ట ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
కాగా కువైట్‌లో కరోనా విజృంభణతో విదేశీయులను వెనక్కి పంపిచాలనే డిమాండ్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో 70 శాతం ఉన్న ప్రవాసీలను 30 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లును ప్రధాన మంత్రి షేక్ సబా అల్ – ఖలీద్ అల్ – సబా ప్రతిపాదించినట్లు స్థానిక మీడియా చెప్పింది. దీని ప్రకారం 43లక్షల జనాభా ( population) ఉన్న వివిధ దేశాల ప్రవాసీల సంఖ్య 30 లక్షలు కాగా వీరిలో అత్యధికంగా భారత్ నుంచి 14 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన 30 శాతం ప్రకారం అత్యధికంగా భారత్ నుంచి 8లక్షల మంది వెనక్కి రావాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కువైట్‌లో భారతీయ ఎంబసీ లెక్కల ప్రకారం సుమారు 28 వేల మంది భారతీయులు ఆ దేశ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు, చమురు కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. సుమారు 5.23 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తూండగా వీరిపై ఆధారపడ్డ వారు 1.16 లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ సుమారు 60 వేల మంది భారతీయ సంతతి విద్యార్థులు దేశంలోని 23 పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్–19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది.ప్రస్తుతం కువైట్ మొత్తమ్మీద సుమారు 49 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా విదేశీయుల సంఖ్యను తగ్గించాల్సిందిగా కోరుతున్నారు.
కువైట్ జనాభాలో ఎవరెంతమంది?
కువైటీలు: 30.36%
ఇతర అరబ్ దేశాల వారు:27.29
ఆసియావాసులు:40.42%
ఆఫ్రికావాసులు: 1.02%
యూరప్‌వాసులు: 0.39%
ఇతరులు: 0.52%