Dust Storm in Delhi: దిల్లీని ముంచెత్తిన దుమ్ము తుఫాన్, దేశ రాజధాని వాతావరణంలో ఆకస్మిక మార్పు, తెలంగాణలో ఉత్తరాఖండ్ లాంటి వాతావరణం, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అనూహ్య మార్పులు
ఈరోజు ఉత్తరాఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఒకే విధమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ఆదివారం ఉదయం నుంచి వేగంగా వీచే చల్లని గాలులతో పాటు.....
New Delhi, May 10: దేశ రాజధాని దిల్లీలోని వాతావరణంలో ఆదివారం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో విపరీతమైన దుమ్ముతో కూడిన తుఫాను చెలరేగింది మరియు ఆకస్మిక వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పడిపోయి క్లైమేట్ చల్లబడింది.
వేసవి కారణంగా దిల్లీలో గత వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయడంతో పాటు, వడగాల్పులు వీచాయి. అయితే ప్రస్తుతం వాతావరణం మారడంతో దిల్లీ వాసులు చల్లదనాన్ని అనుభూతి చెందుతున్నారు. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు దిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దిల్లీ పొరుగున ఉన్న హరియాణ మరియు ఛండీఘర్ రాష్ట్రాలలో కూడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
Here's the update by ANI
ఒక్క దిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉత్తరాఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఒకే విధమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ఆదివారం ఉదయం నుంచి వేగంగా వీచే చల్లని గాలులతో పాటు అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఇవే కాకుండా, వాతావరణ శాఖ సూచన ప్రకారం జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో దుమ్ముతో కూడిన తుఫానులు చూడవచ్చు.
ఇదిలా ఉంటే, దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా మరోవైపు విశాఖలో గ్యాస్ లీక్, తమిళనాడులో బాయిలర్ బ్లాస్ట్, మహారాష్ట్రలో రైలు ప్రమాదం లాగా ఈ వాతావరణంలో మార్పులు మరేదైనా విపత్తును సూచిస్తుందా? అని కొంతమంది భయాలను వ్యక్తం చేస్తున్నారు.