Farmers Protest in Delhi: మాటల్లేవ్.., మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, ఢిల్లీలో కదం తొక్కుతున్న రైతులు, మూడో రోజుకు చేరిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం
ప్రధాని మోదీ సర్కార్ తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపడుతున్న ఆందోళన ఉధృత రూపం (Farmers Protest in Delhi) దాల్చింది. చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు శనివారం వేలాది మంది రైతన్నలు దేశ రాజధానిలో (Delhi) కదంతొక్కారు.
New Delhi, November 29: ప్రధాని మోదీ సర్కార్ తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపడుతున్న ఆందోళన ఉధృత రూపం (Farmers Protest in Delhi) దాల్చింది. చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు శనివారం వేలాది మంది రైతన్నలు దేశ రాజధానిలో (Delhi) కదంతొక్కారు. బురారి ప్రాంతంలోని నిరంకార్ మైదానంలో (Nirankar ground) నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు (Farmers) ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారానే కాకుండా కాలినడకన నిరసన స్థలికి చేరుకున్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కితీసుకోవాల్సిందేనని అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని తేల్చిచెప్పారు. స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, సీపీఎం నేత హన్నన్ మొల్ల, సామాజికవేత్త మేధా పాట్కర్ తదితరులు వెళ్లి రైతులకు మద్దతు ప్రకటించారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌తోపాటు మధ్యప్రదేశ్ నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. ఉత్తర ఢిల్లీలోని నిరంకారి మైదానంలో నిరసనలకు అనుమతిచ్చినా రైతులు ఇంకా ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనలు తెలుపుతున్నారు. జంతర్ మంతర్‌లో లేదా రాంలీలా మైదానంలో నిరసనలకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి వద్ద ఆందోళన కొనసాగిస్తున్న వేలాది మంది రైతులు అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. జంతర్‌మంతర్ మైదానాన్ని కేటాయించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శనివారం ఉదయం సింఘు సరిహద్దు వద్ద రైతన్నలు సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో కదం తొక్కిన రైతులు, కొత్త వ్యవసాయ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమబాట, మద్దతు తెలిపిన కేజ్రీవాల్, పంజాబ్‌కు అన్ని సర్వీసులను రద్దు చేసిన హర్యానా ప్రభుత్వం
మేం ఇక్కడి నుంచే పోరాటం కొనసాగిస్తాం. నిరసనల్లో పాల్గొనేందుకు హర్యానా, పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారని చెప్పారు. మరోవైపు డిసెంబర్ 3న మరోసారి చర్చలు జరిపేందుకు రావాలని పంజాబ్‌లోని రైతు సంఘాలను కేంద్రం ఆహ్వానించింది. అయితే చర్చలకు రైతులు సుముఖంగా లేరని తెలుస్తోంది. డిమాండ్లు నెరవేర్చేదాకా చర్చలు కొనసాగించే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న పలువురు రైతులపై హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్యాయత్నం తదితర కేసులను బనాయించింది. నిరసనల సందర్భంగా రైతులపై ప్రయోగించిన జలఫిరంగులను ఆపేందుకు ప్రయత్నించిన 26 ఏండ్ల నవదీప్ సింగ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు మోపారు. అయితే రైతులను కాపాడేందుకు యత్నించిన నవదీప్‌సింగ్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, భారతీయ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్, మరికొందరు రైతులపైనా హత్యాయత్నం, దోపిడీ, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు మోపారు.
రైతుల ఆందోళనలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని, ఈ మేరకు తమ వద్ద పక్కా సమాచారముందని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈ ఆందోళనలో హరియాణా రైతులే లేరని, ఏమైనా జరిగితే దానికి పంజాబ్ రైతులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పంజాబ్ సీఎం కార్యాలయం నుంచే రైతులకు ఆదేశాలు వెళ్తున్నాయి. పంజాబ్ సీఎం కనీసం నా ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఆందోళనల్లో హర్యానా రైతులు పాల్గొనడం లేదు. నిరసనల్లో ‘ఖలిస్థానీ’ (పంజాబ్ వేర్పాటువాద సంస్థల) ప్రమేయం ఉన్నదని హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.
నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నది. వాళ్లు ఢిల్లీకి వెళ్లకుండా మేమెలా ఆపుతాం? మీరు (ఖట్టర్) కూడా ఎందుకు ఆపుతున్నారు? రైతులపై జలఫిరంగులను ఎందుకు ప్రయోగిస్తున్నారు? ఇప్పుడు ఖట్టర్ నాకు పదిసార్లు ఫోన్ చేసినా స్పందించంటూ ప్రతిగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ నాయకుల మాటలు విని కొంత మంది రైతులు ఆగమవుతున్నారు. కానీ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు మంచివేనని రైతులు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉన్నదంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఇక రైతులతో వెంటనే చర్చలు జరపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిని డిమాండ్ చేశారు.
కాగా రాజకీయ పక్షాల నుంచే కాకుండా విద్యార్థి లోకం సైతం అన్నదాతల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. రైతులపై అణిచివేతలు ఆపాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే నేత టీఆర్ బాలు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్‌బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్, ఆర్‌ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య సంయుక్త ప్రకటన జారీ చేశారు.
దేశ ఆహార భద్రతకు, కనీస మద్ధతు ధరలకు, ముప్పు తెచ్చేలా తెచ్చేలా ఉన్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.
డిసెంబరు 3న రైతులను చర్చలకు ఆహ్వానించామని తెలిపారు. రైతులకు సంబంధించిన ప్రతీ ఒక్క సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆందోళనలను నిరంకారి మైదానంలో శాంతియుతంగా కొనసాగించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ రైతుల కోసం మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, అంబులెన్స్ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు షా చెప్పారు. అయితే ఈ చర్చలకు రైతు సంఘాలు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ మాట్లాడుతూ అమిత్ షా చర్చలకు ఆహ్వనించారు..అయితే అందులో మాకు మాపై ప్రేమ కనబడటం లేదు. ఎటవంటి కండీషన్లు లేకుండా మాతో మాట్లాడాలి.. అయినా ఈ విషయంపై రేపు చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ప్రభుత్వం తమ డిమాండ్‌కు దిగొచ్చేంత వరకు నిరసన కొనసాగించాలన్న లక్ష్యంతో వేలాది మంది రైతులు ట్రక్కులు, ట్రాక్టర్లలో, కాలినడకన ఢిల్లీకి వచ్చారు. 2 నెలలకు సరిపడా ఆహార పదార్ధాలను వెంట తీసుకొచ్చామని రైతులు చెప్పా రు. ట్రక్కుల్లో ఉల్లిగడ్డలు, గోధుమ పిండి, బియ్యం, కట్టెలు తీసుకొచ్చి, మైదానంలోనే వంట చేసుకొని అక్కడే తింటున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)